
డిఫాల్టర్లను వదిలేసి.. మాపై పడతారా!
● చిన్న సన్నకారు రైతుల మండిపాటు
● సంఘం అధికారులు వేధిస్తున్నారంటూ ఆందోళన
అబ్దుల్లాపూర్‌మెట్: రైతుల ముసుగులో కొందరు రైతుసేవా సహకార సంఘం నుంచి అధిక మొత్తంలో రుణాలు పొంది, చెల్లించడం లేదని.. డిఫాల్టర్లు చెల్లిస్తేనే తాము చెల్లిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణాలను త్వరగా చెల్లించాలని సంఘం అఽధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయం ఎదుట మజీద్‌పూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సాగు చేయని వారికి పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చి, వసూలు చేయకుండా కాలం గడుపుతున్నారని, చిన్నమొత్తం రుణంగా ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుణాలు మంజూరు చేసి, డబ్బులు ఇవ్వకుండా కొందరు రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. కొంత మంది 200 గజాల ప్లాటు తప్పుడు పత్రాలు పెట్టి, బ్యాంకులో రుణాలు పొందారని పేర్కొన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని, రుణాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు పొంది సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి, రూ. కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత అలాంటి వారి నుంచి రుణం వసూలు చేయాలని సూచించారు.