
ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తే చర్యలు
రాజేంద్రనగర్: వాహనదారులు ప్రమాదకర విన్యాసాలు, ప్రజలకు ఆటంకం కలిగించేలా ర్యాష్‌గా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.రాజు హెచ్చరించారు. ఇటీవల మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్, చంపాపేట్‌కు చెందిన జాఫర్ అహ్మద్ షా, బాలాపూర్‌కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ అనే యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి హోండా షైన్ వాహనం (ఏపీ12పీ 7745), యాక్టివా (టీఎస్10ఎఫ్‌జీ 5061) వాహనాలను స్వాధీనం చేసుకొని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ 16వ తేదీన బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలను నడుపుతూ వాహనాలపై మద్యం సేవిస్తూ ప్రజలకు, వాహనదారులు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ విషయాన్ని ఇతర వాహనదారులు వీడియోలు తీసి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు ఆన్‌లైన్‌లో తెలపగా.. వారిని గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి వారి పత్రాలను పరిశీలించి తదుపరి విచారణ నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించామని వివరించారు.
పెద్దమ్మ ఆలయంలో భక్తురాలి గొలుసు చోరీ
ఫిలింనగర్: జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించేందుకు వచ్చిన ఓ మహిళా భక్తురాలి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. అదే సమయంలో మొక్కు తీర్చుకుంటుండగా ఆమె హ్యాండ్‌బ్యాగ్ చోరీకి గురైంది. అందులో ఉన్న 13 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురి కావడంతోఆమె కొడుకు నరేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొక్కు తీర్చుకునేందుకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తన తల్లి హ్యాండ్‌బ్యాగ్ చోరీ చేశారని, అందులో బంగారంతో పాటు నగదు ఉందని పేర్కొన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను చోరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసుల వేట
అత్తాపూర్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడం..కొద్ది రోజుల తరువాత మరో అమ్మాయితో ప్రేమ అంటూ వెంట పడుతున్న నిత్య పెళ్లి కొడుకు కోసం అత్తాపూర్ పోలీసులుగ గాలిస్తున్నారు. పెళ్లి పేరుతో మోసపోయిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవికుమార్ ఎలియాస్ రఫీపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. రవికుమార్ కొంత కాలంగా అత్తాపూర్ పరిసర ప్రాంతాలలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంగా చేస్తున్నట్లు నటించసాగాడు. తనకంటే వయస్సులో కంటే చిన్న వారిని గుర్తించి ప్రేమ పేరుతో నమ్మించి వివాహాలు చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను లొంగదీసుకోవడంతో పాటు శారీరకంగా మానసికంగా హింసిస్తాడని పోలీసులు తెలిపారు. ప్రేమించుకునే సమయంలో మాట్లాడుతున్న సంభాషణలు వారు గడిపిన ప్రదేశాలను ఆడియో... వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ ఉండటంతో బాధిత యువతులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. తప్పించుకు తిరుగుతున్న రఫీపై వివిధ కేసులు నమోదు చేశారమన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.