
అగ్ర భారతే లక్ష్యం
విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు పెద్దపీట వేయాలి
● ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
● సాక్షి ఆధ్వర్యంలో వందేళ్ల భారత్‌పై టాక్ షో
ఇబ్రహీంపట్నం: ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉన్నప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, యువతలో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన సాక్షి టాక్ షోలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొ.రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత వెలికితీసే విద్యాబోధనకు సంబంధించిన కోర్సులు రావాలన్నారు. స్వయం శక్తితో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
విద్యతోనే దేశాభివృద్ధి
విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలి. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించాలి. విద్యాబోధనలో సమూల మార్పులు రావాలి.
– జాస్మిన్, బీఏ, ఫస్టియర్
ఒకే వ్యవస్థ ఉండాలి
దేశంలో ఒకే విధానంతో కూడిన వ్యవస్థ ఉండాలి. ప్రైవేటీకరణ పేరుతో దేశ వ్యవస్థను నాశనం చేయవద్దు. ఒకే గొడుగు కింద అన్ని వ్యవస్థలుంటే. దేశాభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. దేశంలో వనరులకు కొదవలేదు. వాటిని కాపాడుకుంటూ దేశ ప్రగతికి తోడ్పడాలి. – మనీషా, బీఎస్సీ, సెకండియర్
ప్రగతిబాటలో పల్లెలుండాలి
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు కావొస్తున్న గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి.
– విజయ్, బీఏ, ఫస్టియర్
యువతను కాపాడుకోవాలి
మన దేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారు. వారు విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారి శక్తి సామర్థ్యాలను దేశం ఉపయోగించుకోవాలి. ప్రతిభ గల వారికి ప్రాధాన్యతను ఇస్తూ దేశాభివృద్ధిలో భాగం చేయాలి
– ప్రసన్నలక్ష్మి, బీఎస్సీ, సెకండియర్
స్వయం ఉపాధి కల్పించాలి
స్వయం ఉపాధి పొందేలా యువతను తీర్చిదిద్దాలి. ఇతరులపై ఆధార పడకుండా వారే స్వశక్తితో ఉన్నంతగా ఎదిగేందుకు విద్యాబోధన దోహదపడాలి. ఆ దిశగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. స్టార్టప్ కంపెనీలు నెలకోల్పాలి.
– ఫాతిమా, బీకాం, ఫస్టియర్
ఆరోగ్య భారత్‌గా తీర్చిదిద్దాలి
ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుంది. అందుకు పల్లె నుంచి పట్ట ణం వరకు వైద్యసేవలను అందించాలి. మనిషి ఆరోగ్య ంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారుతారు.
– కేశవర్ధన్, బీఎస్సీ, సెకండియర్
మహిళలకు సీట్లు ఇవ్వాలి
చట్ట సభల్లో సమాన ప్రాతినిథ్యం కల్పించాలి. ఇంటికి దీపం ఇల్లాలు ఎలా అంటామో జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో మహిళలకు సీట్లు కేటాయించాలి. అప్పడే మహిళా సాధికారత సాధించి దేశ పురోగమనం సాధ్యమౌతుంది.
– స్వాతి, బీఎస్సీ, ఫస్టియర్
టెక్నాలజీలో మార్పులు రావాలి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి. ఫ్రెంచ్ విప్లవం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు విద్యార్థులే కీలకపాత్ర పోషించారు. వందేళ్ల స్వాతంత్య్ర భారత్ అభివృద్ధి దేశంగా ప్రపంచలో పేరుప్రఖ్యాతలు పొందాలంటే యువత చేతల్లోనే ఉంది. ఆ దిశగా వాళ్లకి తర్ఫీదు ఇవ్వాలి.
– డా.సురేశ్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకుడు
దేశాభివృద్ధికి కృషి చేయాలి
విద్యార్థులు, యువత దేశాభివృద్ధికి పోటీ పడాలి. కుల, మత, ప్రాంత విభేదాలు మూడ నమ్మకాలు పక్కన పెట్టాలి. ఆర్టికల్ 14 ప్రకారం మహిళలకు సమాన హక్కులుండాలి. దేశంలో విజ్ఞానవంతులు కొదవలేదు. వారు విదేశాలకు వెళ్లకుండా సరైన అవకాశాలు సృష్టించాలి
– డా.రమేశ్, అధ్యాపకుడు