పటిష్ట భారత్‌కే జై | - | Sakshi
Sakshi News home page

పటిష్ట భారత్‌కే జై

Aug 15 2025 11:31 AM | Updated on Aug 15 2025 11:31 AM

పటిష్ట భారత్‌కే జై

పటిష్ట భారత్‌కే జై

యువతదే బాధ్యత ఉచిత వైద్యం ఇవ్వాలి మహిళలకు స్వేచ్ఛ రావాలి సమానత్వం రావాలి మార్పు కోరుకోవాలి రాజకీయాల్లోకి రావాలి అన్ని రంగాల్లో అభివృద్ధి జాతీయభావం పెరగాలి రాజ్యాంగ మార్పు అవసరం సాంకేతికతలో మరింతగా.. అందరికీ ఉచిత విద్య రిజర్వేషన్లు రద్దు చేయాలి రాజ్యాంగం అమలు చేయాలి చట్టాల్లో మార్పు రావాలి

మొయినాబాద్‌/చేవెళ్ల: భారతదేశాన్ని ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా చూడాలని యువత ఆకాంక్షిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలి’ అనే అంశంపై మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం విద్యార్థులతో సాక్షి టాక్‌ షో నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలని వారి కలలు, ఆకాంక్షలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల డీఎస్‌ఏ డీన్‌ జరినా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం కూడా చేరేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఉందన్నారు. వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలని అంశంపై సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుందన్నారు. దేశం కోసం యువత ఏం చేస్తామని, ఎలా ఉండాలని కోరుకునే ఈ కార్యక్రమం బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తి నింపే విధంగా ఉంటాయని కితాబిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎంతో మంది సమరయోధుల త్యాగాలతో వచ్చిన దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదిరి చూడకుండా ప్రతిఒక్కరూ తమదే బాధ్యత అనే విధంగా దేశం కోసం పనిచేయాలి. 79 ఏళ్ల స్వాతంత్య్రంలో సాధించుకున్న విజయాలను గుర్తుచేసుకుంటూ వందేళ్ల భారత్‌ కోసం చేయాల్సిన బాధ్యతలను, లక్ష్యాలను గుర్తు చేసుకోవాలి.

– చంద్రప్రకాశ్‌, ఈసీ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అయ్యింది. కానీ అందరికీ విద్య, వైద్యం సరిగా అందని పరిస్థితి ఉంది. చదువును, ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వందేళ్ల భారత్‌లో మారాలి. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలి. – ప్రణిత్‌

సాంకేతిక రంగంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి. మహిళలకు పూర్తి స్వేచ్ఛ రావాలి. ప్రతిఒక్కరూ చైతన్యవంతులు కావాలి. మహిళలంతా చదువుకుంటేనే వారికి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు లభిస్తాయి. ఇంకా మార్పుకోసం ఎదురుచూడటం కాదు. వందేళ్ల భారత్‌లో మారి చూపించాలి.

– గ్రీష్మ

ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ల పద్ధతి కాకుండా ప్రతిభ ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు లభించాలి. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. దేశంలో ఈ విధానం అమలులోకి వస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

– నాగ విఘ్నేశ్వర్‌

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనిషి ఎప్పుడు మార్పును కోరుకోవాలి. అది సమాజ హితం వైపు ఉండాలి. ప్రతి మనిషిలో మానవత్వం, మహిళల పట్ల అందరిలో గౌరవం పెరగాలి. దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి.

– స్వర్ణ

దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి. ప్రస్తుత రాజకీయాలు స్వార్థం, అవినీతిమయంగా మారాయి. వీటిని రూపుమాపేందుకు చైతన్యవంతమైన యువత ముందుకు రావాలి. – మౌనిక

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రంగాల్లో రాణించాలి. విద్య, వైద్యం, టెక్నా లజీ, పరిపాలన విభాగాలన్ని బలోపేతం కావాలి. యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి. అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి. – అమూల్య

భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారతదేశంలోని ప్రజలందరిలో జాతీయభావం పెరగాలి. సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి. దేశం విలువలను ప్రపంచానికి చాటే విధంగా యువత ఎదగాలి.

– సమీనా

మన రాజ్యాంగంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆనాటి అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులుండాలి.

– శివరామకృష్ణ

విదేశాలల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మించిన పురోగతిని మన దేశంలో మరింతగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలే ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ లాంటి కోర్సులు మరిన్ని రావాలి. – సాయి

దేశంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రతిఒక్కరూ విద్యను అభ్యసించి నచ్చిన రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి.

– సిద్దు

మన దేశంలో ఉన్న మతాలు, కులాల ప్రతిపాదికన ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థ పూర్తిగా పోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సమానమే అనే భావనతో జీవించేలా చట్టాలు రావాలి. రిజర్వేషన్ల వ్యవస్థతో పేదవారికి న్యాయం కంటే అన్యాయం ఎక్కువగా జరుగుతుంది.

– జశ్వంత్‌

మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అందించారు. దానిని మన పాలకులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి.

– రాజేశ్‌

దేశంలో ఉన్న చట్టాల్లో అనేక మార్పులు చేయాలి. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి భద్రతపై భరోసా కల్పించాలి. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. – సింధు

అగ్రగామి దేశంగా నిలవాలని యువత ఆకాంక్ష

మొయినాబాద్‌లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో సాక్షి టాక్‌ షో

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement