
మా ఊరిలో మందు బంద్
● పలు గ్రామాల్లో సంపూర్ణమద్యపాన నిషేధం
● మహిళల చైతన్యంతో
షాద్‌నగర్: కేశంపేట మండలం బోదనంపల్లిలో 14 ఏళ్ల క్రితం మొదలైన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజు వరకూ అలాగే కొనసాగుతోంది. ఈగ్రామంలో ఎక్కడా బెల్టు షాపులు, మద్యం సేవించడం కనిపించదు. మద్యం ప్రియులు కావాలనును కుంటే బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఇదే స్ఫూర్తితో అల్వాల గ్రామస్తులు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు.
ఒక్కడితో మొదలై..
మద్య నిషేదం కోసం పలు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. ముందుగా ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన నడుల్ల శేఖర్‌తో పోరాటం మొదలైంది. తమ గ్రామంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ గత సెప్టెంబర్‌లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. గ్రామ పెద్దలు, మహిళలు రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలిచారు. స్థానికంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం అమ్మేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామనిప్రకటించడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ఈ పోరాటం గంట్లవెళ్లి, చౌడమ్మగుట్టతండాలో కూడా కొనసాగుతోంది.
జీవితాలు నాశనం కావొద్దని
గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. ప్రజల జీవితాలు నాశనం కావొద్దని ఆలోచనతో పోరాటం ప్రారంభించా. స్థానికుల మద్దతుతో ఎమ్మెల్యేతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశాం. అందరి పోరాటంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి.
– శేఖర్, కిషన్‌నగర్, ఫరూఖ్‌నగర్ మండలం
మహిళల పోరాటంతోనే నిషేధం
మద్యంతో చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. దీంతో గ్రామంలో బెల్టు దుకాణాలు తొలగించాలని, మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో గ్రామంలో 14 ఏళ్లుగా మద్యం నిషేధం అమలవుతోంది.
– ఎదిర కళమ్మ, బొదనంపల్లి, కేశంపేట