
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఆమనగల్లు: దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా పరిణమించిందని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఆమనగల్లులో గురువారం అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్‌ఆర్ రెస్పాన్సిబులిటీ నిధులు రూ.4 కోట్లతో చేపట్టిన బీసీ బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మార్కెట్ చైర్మన్ యాట గీత, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానందరెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు చోర్ గద్దె దిగాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బిస్కెట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రార్, ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. జూనియర్ కాలేజీ స్థల వివాదాన్ని, కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు.
అభివృద్ధే లక్ష్యం..
కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, నాయకులు కేశవులు, యాట నర్సింహ, జగన్, మానయ్య, బీసీ సంక్షేమశాఖ డీడీ కేశురామ్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్ లలిత తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల చోరీపై ఉద్యమానికి ప్రజలు సహకరించాలి
నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి
ఆమనగల్లులో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన