
గిరిజన తెగల్లో నేటికీ ఆకలి చావులు
● రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
యాచారం: గిరిజన, ఆదివాసీ తెగల్లో నేటికీ ఆకలి చావులు తప్పడం లేదని.. స్వయంగా ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ, గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తెగల్లో ఏ విధమైన మార్పు రావడం లేదని, రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదని అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నాయని దుయ్యబట్టారు. నేటికీ అటవీ భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతుంటే వాటని ఆక్రమిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రాజెక్టులు, ఖనిజం తవ్వకాల పేరుతో బలవంత తరలింపు జరుగుతోందన్నారు. ఇప్పటికీ తండాల్లో రోడ్డు మార్గం, విద్యుత్, తాగునీటి సౌకర్యాం లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలసమయంలో అనేక హామీలు గుప్పిస్తూ గెలుపొందిన తర్వాత విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తండాల్లో పర్యటించి వారి సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ కంట్రోల్ కమిటీ చైర్మన్ డీజీ నర్సింహరావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.