కూలీల సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల: ఉపాధి హామీ పథకంలో పనిచేసే పేద కూలీలకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని, పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిలో ఉపాధి పనులు చేసే కూలీలకు పని చేసే చోట కనీస వసతులు కల్పించాలన్న నిబంధనలు ఉన్నాయని, వాటిని తప్పనిసరి పాటించాలన్నారు. కనీస వేతనం రావడం లేదని, ఐదు వారాల నుంచి ఉపాధి కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలని, కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలీ రూ.700 ఇవ్వాలని, 200 రోజులు పనులు కల్పించాలని, కూలీలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. కూలీలు, కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, అండగా నిలబడి పోరాడతామని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రామస్వామి, సత్యనారాయణ, ప్రభులింగం, అంజయ్య, జంగయ్య, మంజుల, మక్బుల్, నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.
బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య


