అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ● ప్రజావాణికి 46 దరఖాస్తులు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఆయా శాఖల వారీగా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు అందజేసిన 46 దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: తోల్‌కట్టలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని పలువురు గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 107లో 12.16 ఎకరాల లావణీ భూమి ఉందని తెలిపారు. ఇందులో కొంత భూమిని ఇతరులు క్రయవిక్రయాలు చేశారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి, సర్కారు భూమిని స్వాధీనం చేసుకోవాలని శివశంకర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, నర్సింహ్మ, మల్లేష్, యాదయ్య తదితరులు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు దరఖాస్తు అందజేశారు.


