
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 76.95 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, సెకండియర్‌లో 77.72 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఫలితాల శాతం కొంత తగ్గినప్పటికీ ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తమ ఫలితాలు సాధించింది. ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలదే హవా కొనసాగింది. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షి యల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ మార్కులు సాధించిన వారిలో ఆటోడ్రైవర్, దినసరి కూలీల పిల్లలు సైతం ఉన్నారు. ఇక జనరల్ విద్యార్థులతో పోలిస్తే..ఒకేషనల్ విద్యార్థులు ఈసారి కొంత ముందంజలో ఉన్నారు.
మొదటిలో రెండో స్థానం
● ఫస్టియర్ జనరల్‌లో మొత్తం 76,967 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 59,227 మంది ఉత్తీర్ణత (76.95శాతం) సాధించారు. వీరిలో 39,503 మంది బాలురకు 28,537 మంది (72.24 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 37,464 మంది పరీక్షకు హాజరు కాగా 30,690 మంది ఉత్తీర్ణత (81.92 శాతం) సాధించారు.
● ఒకేషనల్ కోర్సులో 3,445 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,179 మంది ఉత్తీర్ణత (63.25 శాతం) సాధించారు. బాలురు 1,736 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 834 మంది ఉత్తీర్ణత (48.04 శాతం) సాధించారు. బాలికలు 1,709 మంది పరీక్షకు హాజరు కాగా 1,345 మంది ఉత్తీర్ణత (78.70శాతం) సాధించారు.
ద్వితీయంలో నాలుగో స్థానం
● సెకండియర్ జనరల్ కోర్సుల్లో మొత్తం 67,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 52,526 మంది ఉత్తీర్ణత (77.72 శాతం) సాధించారు. 34,884 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 25,711 మంది ఉత్తీర్ణత (73.70 శాతం) సాధించారు. 32,702 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 26,815 మంది ఉత్తీర్ణత (82 శాతం) సాధించారు.
● ఒకేషనల్ కోర్సుల్లో 2,995 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,195 మంది ఉత్తీర్ణత (73.29 శాతం) సాధించారు. బాలురు 1,521 మంది పరీక్షకు హాజరుకాగా 901 మంది ఉత్తీర్ణత (59.24 శాతం) సాధించారు. బాలికలు 1,474 మంది పరీక్షకు హాజరుకాగా 1,294 (87.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
2024తో పోలిస్తే 2025లో తగ్గిన ఉత్తీర్ణత శాతం
ప్రథమ సంవత్సరంలో ఒకటి నుంచి రెండో స్థానానికి..
ద్వితీయ సంవత్సరంలో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన ర్యాంకు