అప్పు తీర్చలేదని.. హత్య చేశారు
కొత్తూరు: అప్పు చెల్లించమంటే కాలయాపన చేయడం.. దానికితోడు పాతకక్షలు పెట్టుకొని కొత్తూరు పట్టణంలో ఈ నెల 11న యువకుడిని తోటి స్నేహితులే హత్య చేసినట్లు షాద్‌నగర్ డీసీపీ శిరీషరాఘవేంద్ర పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్న మాధవ్ బిరదర్ అలియాస్ ఆకాష్(27), మహ్మద్ ఒవైజ్, మహ్మద్ ఇర్ఫాన్, నసీర్ పాషా, షేక్ సోహైల్‌స్నేహితులు. కాగా మహ్మద్ ఒవైజ్ వద్ద మాధవ్ బిరదర్ తన అవసరాల కోసం రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించడం లేదు. అంతేకాకుండా మాధవ్ బిరదర్ మరో స్నేహితుడైన మహ్మద్ ఇర్ఫాన్ సోదరితో చనువుగా ఉంటున్నాడు. దీంతో వారిద్దరూ తమ మిత్రులైన నసీర్‌పాషా, షేక్ సోహైల్‌తో కలిసి మాధవ్ హత్యకు పథకం వేశారు. ఆదివారం మాధవ్ అద్దెకు నడిపే ఆటోలోనే ఐదుగురు కలిసి మద్యం కొనుగోలు చేసి కొత్తూరు శివానగర్ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని తాగారు. మాధవ్ మత్తులోకి చేరుకోగానే అతడిపై బీరు బాటిళ్లు, రాళ్లు, కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొత్తూరు బస్టాప్ వద్ద ఆటోలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని గుర్తించి తమదైన శైలిలో విచారించగా మాధవ్ బిరదర్‌ను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి మీనాబాయి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా మృతుడిపై రౌడీషీట్, నలుగురు నిందితులపై ఆయా పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పాత కేసుల వివరాలను పరిశీలించి నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయడానికి పరిశీలిస్తామన్నారు. హత్యాకేసును ఒకే రోజులో ఛేదించిన కొత్తూరు సీఐ నర్సయ్య, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నర్సయ్య, ఎస్‌ఐలు గోపాలకృష్ణ, సత్యశీలరెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


