వరి.. తగ్గుతోంది మరి!
భూమి మొత్తం ఫార్మాసిటీకే..
పెట్టుబడి రావడం లేదు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వరి పంట సాగు జిల్లాలో భారీగా తగ్గింది. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగు అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు 32 వేల ఎకరాలకు మించలేదు. బోరుబావుల కింద మాత్రమే కాదు మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం.
తగ్గిన సాగు విస్తీర్ణం
జిల్లాలో 2,127 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి కింద 71,115 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇక బోరు బావులు, మూసీ, ఈసీ వాగులకు ఇరువైపులా మరికొంత సాగవుతోంది. 2022–23 వానాకాలంలో 4,28,479 ఎకరాల్లో పంట సాగవ్వగా, అదే యాసంగిలో 1.41,228 ఎకరాలు సాగైంది. 2023–24 యాసంగిలో 1,25,600 ఎకరాలు.. 2024 యాసంగిలో 1,39,754 ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2025–26 యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 4,390.255 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. అంచనాల మేర పంట సాగు లేకపోవడం విశేషం. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. భూగర్భ జలాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం పెరగక పోగా, మరింత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఎరువుల పంపకం కోసం ప్రభుత్వం ఫెర్టియాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంట సాగు చేసిన రైతులు యూరియా కోసం ఈ యాప్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాలు మాత్రమే పంటసాగైనట్లు ఈ యాప్ ద్వారా తేలింది.
కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు..
● ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో జిల్లాలోని భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ కారణంగా పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి.
● నిన్నటి వరకు పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలతో ఆహ్లాదంగా కనిపించిన భూములు ఎత్తయిన భవనాలతో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులుగా మారుతున్నాయి.
● కూలీల ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గడం, చీడపీడల సమస్య వేధిస్తుండటంతో మెజార్టీ రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు పండ్లు, పూలు, కాయగూరలు పండిన భూముల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి.
● ఇప్పటికే సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాలు పూర్తిగా పట్టణీకరణ జరిగిపోయాయి.
● అంతో ఇంతో పంటలు పండిన శంషాబాద్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోనూ 80 శాతం పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. కేవలం 20 శాతం భూముల్లోనే పంటలు సాగవుతున్నాయి.
● మంచాల, మాడ్గుల, ఆమనగల్లు, కేశంపేట, కొందుర్గు, షాబాద్, యాచారం మండలాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. చేవెళ్ల, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, జిల్లెడు చౌదరిగూడ, మండలాల్లో 50 శాతం భూములు ఇప్పటికే వ్యవసాయానికి దూరమయ్యాయి.
జిల్లాలో భారీగా పడిపోయిన సాగు
అంచనాలు తలకిందులు
1.57 లక్షల ఎకరాలు అంచనా
32 వేల ఎకరాలకు మించని వైనం
గణనీయంగా తగ్గిన విస్తీర్ణం
పట్టా, అసైన్డ్ భూమి మొత్తం ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. దీంతో పంటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఊరు విడిచి పట్నం వెళ్లి బతుకుతున్నాం.
– బొక్కా శ్రీధర్‌రెడ్డి, రైతు, తాడిపర్తి, యాచారం మండలం
కూలీల ఖర్చు పెరిగి పెట్టు బడి కూడా రావడం లేదు. మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్నారు. గతంలో ఏడు ఎకరాల్లో పూలు, కూరగాయలు పండించే వాళ్లం. ఇప్పుడు మూడు ఎకరాల్లో వరి పంట మాత్రమే సాగు చేస్తున్నా.
– నరేందర్, రైతు, చౌదరిగుడ, శంషాబాద్
వరి.. తగ్గుతోంది మరి!
వరి.. తగ్గుతోంది మరి!


