విలీనం వెనక కుట్ర
మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్‌లో విలీనం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బీజేపీ సమరశంఖం పూరించింది. ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ పొన్నమోని మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన సోమవారం ఆరాంఘర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్‌లో విలీనం చేయడమనేది కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల భూములు, స్థానిక ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యతలను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక సామాజిక, భౌగోళిక గుర్తింపు ఉందన్నారు. కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. జిల్లా ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎంతవరకై నా పోరాడుతుందని స్పష్టంచేశారు. రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, జిల్లాలోని అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలను నగరంలో కలిపి, గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. విలీనం జరిగితే స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయని, ప్రజల స్వయం నిర్ణయ హక్కు హరించబడుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తోకల శ్రీనివాస్‌రెడ్డి, అందెల శ్రీరాములుయాదవ్, అంజన్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


