కోటా దాటింది! | - | Sakshi
Sakshi News home page

కోటా దాటింది!

Apr 22 2025 7:02 AM | Updated on Apr 22 2025 7:02 AM

కోటా

కోటా దాటింది!

ఉపాధ్యాయ కేటాయింపుల్లో స్థానిక రగడ
● స్పౌజ్‌ కేటగిరీలో జిల్లాకు మరో 32 మంది రాక ● ఇప్పటికే 50 శాతం మించిన నాన్‌ లోకల్‌ టీచర్లు ● తాజాగా మరికొంత మంది కేటాయింపుపై విమర్శలు ● వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా విద్యాశాఖలో మళ్లీ స్థానిక రగడ మొదలైంది. ఇప్పటికే అనేక మంది స్థానికతకు విరుద్ధంగా వచ్చి జిల్లాలో పాగా వేశారు. తాజాగా మరికొంత మంది ఉపాధ్యాయులను కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. స్పౌజ్‌ కోటాలో ఇతర జిల్లాలకు చెందిన మరో 32 మందిని జిల్లాకు కేటాయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇతర జిల్లాల వారితో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా స్థానికంగా ఉన్న నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,054 ఎస్‌జీటీలు, 3,997 స్కూల్‌ అసిస్టెంట్లు, 278 మంది హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, 200 మంది ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. నిజానికి స్థానికేతరుల కోటా 20 శాతానికి మించకూడదు. కానీ ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి చేరినవారితో స్థానికేతరుల కోటా 50 శాతం దాటిపోయింది. ప్రభుత్వ తాజా కేటాయింపులపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

పలుకుబడిని అడ్డంపెట్టుకుని..

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉంది. ఆరోగ్య సమస్యలు, పిల్లల ఉన్నత చదువుల పేరుతో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయసంఘాల నేతలు సహా ప్రజాప్రతినిధుల బంధువులు తమకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడిని అడ్డంపెట్టుకుని డిప్యూటేషన్లపై అడ్డదారుల్లోవచ్చి చేరుతున్నారు. వీరంతా శివారు మండలాల్లో కాకుండా నగరానికి ఆనుకుని ఉన్న సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రాజేంద్రనగర్‌, బాలాపూర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌, శేరిలింగంపల్లి మండలాల పరిధిలోని విద్యార్థుల సంఖ్య పెద్దగా లేని ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగులు పొందుతున్నారు. ఏళ్ల తరబడి శివారు మండలాల్లో పని చేస్తున్న స్థానిక ఉపాధ్యాయులకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలోనూ తీరని అన్యాయం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టులు ఖాళీ లేక ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది.

ఆ ఉత్తర్వులు రద్దు చేయాలి

భార్యభర్తల బదిలీల పేరు తో ప్రభుత్వం జిల్లాకు మ రోసారి తీరని అన్యాయం చేసింది. ఇప్పటికే 50 శాతానికి మించి ఉన్న స్థానికేతరులను వారి సొంత జిల్లాలకు పంపకుండా కొత్తగా మరికొంత మంది ఉపాధ్యాయులను కేటాయించడం దారుణం. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పని చేయాలనే ప్రభుత్వ నిబంధనను స్వాగతిస్తున్నాం. కానీ 317 జీఓను అడ్డుపెట్టుకుని ఇప్పటికే జిల్లాలో పాగా వేసిన స్థానికేతరులను వారి జిల్లాలకు పంపకుండా, తాజాగా వారి సహచరులను స్పౌజ్‌కేటగిరీలో కేటాయించడం అన్యాయం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లా నిరుద్యోగులు మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంది. స్పౌజ్‌ కేటగిరీలో జిల్లాకు కేటాయించిన 32 మంది ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడానికి వెనుకాడబోం.

– సత్తారి రాజిరెడ్డి,

జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ

కోటా దాటింది!1
1/1

కోటా దాటింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement