ధరణి కష్టాలు.. భూ భారతితో దూరం
● రైతుల వద్దకే రెవెన్యూ సేవలు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: ధరణితో పడిన కష్టాలు భూ భారతితో దూరమవుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఓ గార్డెన్‌లో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలు, రైతులకు ఇచ్చి న హామీల్లో భాగంగానే ఈచట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూమి ఉండీ అమ్ముకోలేని స్థితిలో అనేక మంది ధరణితో అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ధరణితో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, భూభారతితో అధికారులే ప్రజల చెంతకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. గతంలో ఒక్క ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ దుస్థితి ఉండబోదని స్పష్టంచేశారు. ఇకనుంచి సర్వే మ్యాప్‌లతోనే రిజిస్ట్రేషన్లు అవుతాయని వెల్లడించారు. ఇందుకోసం 6వేల మంది ట్రైన్డ్ లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే అన్ని గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు అందించి, భూవివరాలు పొందుపరుస్తామన్నారు. అర్హులైన కౌలుదారులకు న్యాయం చేసే వెసులుబాటు ఈ చట్టంలో ఉందని తెలిపారు. భూ భారతి ద్వారా రికార్డుల్లోని తప్పొప్పులను సరిచేసే అధికారాన్ని రెవెన్యూ శాఖకు కల్పించినట్టు మంత్రి పేర్కొన్నారు. పార్ట్– బీలోని 18 లక్షల ఎకరాల భూ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ అధికారి నుంచి జమాబందీ నమోదు చేయించి, రికార్డులు భద్రపరుస్తామని స్పష్టం చేశారు. చట్టంలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రతీ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన వారికి పాసు పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతి మాసింగ్, ఆర్డీఓ అనంతరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహ్మారెడ్డి, మార్కెట్ చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


