వేములవాడఅర్బన్/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట/ ముస్తాబాద్/గంభీరావుపేట/చందుర్తి: జిల్లాలో సోమవారం అకాల వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు. కల్లాల్లో పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోగా.. పొలాల్లోని వరిపంట నేలవాలింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్, ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట, అనంతారం, వెల్జీపురం గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం ముద్దయ్యింది. ప్రారంభంలో దళారులు పచ్చి వడ్లనే అధిక ధరకు కొని ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ రేటుకు కొంటుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
● ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు సేవాలాల్‌తండా, పోతుగల్, ఆవునూర్, గూడెం గ్రామాల్లో కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది. టార్పాలిన్లు కప్పకపోవడంతో రైతులు ఆగమయ్యారు.
● వేములవాడ పట్టణం, వేములవాడ అర్బన్ మండలాల్లో కురిసిన వర్షానికి పంటపొలాల్లోని వడ్లు నేలవాలాయి. గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు లింగన్నపేట, కొత్తపల్లి, రాజుపేట, శ్రీగాధ, దేశాయిపేట, నర్మాల గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది.
● చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మల్యాల, కట్టలింగంపేట, లింగంపేట, చందుర్తి, బండపల్లి గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. టార్ఫాలిన్ కవర్లు కప్పినా ధాన్యం తడిసిపోయింది. కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పలువురు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు.
తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో తడిసిన ధాన్యాన్ని డీఎస్‌వో తనూజ, ఇతర అధికారులు పరిశీలించారు. కొనుగోళ్లపై ఆరా తీశారు. పాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య రైతులను పరామర్శించారు.
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. తూకం మాత్రం ప్రారంభంకాలేదు. దీంతో పలు వురు రైతులు కేంద్రాల్లోనే ధాన్యం ఆరబోశారు. ఈ ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది.


