వేములవాడ: మట్టిని నమ్ముకుని బతుకు బండి లాగిస్తున్న ఆ చేతులకు ఇప్పుడు పని కరువైంది. మార్కెట్‌లోకి వస్తున్న విద్యుత్ దీపాలు.. సరికొత్త దీపాంతలతో స్థానిక కుమ్మరుల చేసే మట్టి ప్రమిదల వ్యాపారం కాస్త మందగించింది. ఒకప్పుడు దీపావళి వస్తుందంటే వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని కుమ్మరులకు తిందామంటే తీరక లేకుండా పని ఉండేది. మట్టితో వివిధ ఆకారాల్లో ప్రమిదలు తయారు చేసి అమ్మేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. మార్కెట్‌ను ముంచెత్తుతున్న రెడీమేడ్, చైనా దీపాలతో మట్టి ప్రమిదల వ్యాపారం పడిపోయింది.
పెరిగిన ఖర్చులు
వేములవాడలో సుమారు 35 కుమ్మరి కుటుంబాలు నివసిస్తున్నాయి. స్థానికంగా మట్టి దొరక్కపోవడంతో చందుర్తి మండలం మల్యాల, సిరిసిల్ల మండలం చిన్నబోనాల నుంచి ట్రాక్టర్ల ద్వారా మట్టిని కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తుండటంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. దీనికి తోడు హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి యంత్రాలపై తయారై వస్తున్న రంగురంగుల రెడీమేడ్ దీపాలను వ్యాపారులు రిక్షాలపై గల్లీగల్లీకి తెచ్చి అమ్ముతున్నారు. దీంతో ఇక్కడి కుమ్మరులు తయారు చేసే మట్టి ప్రమిదలను పట్టించుకునేవారే కరువయ్యారు.
దీపోత్సవాలున్నా స్థానిక కుమ్మరులకు
ఉపాధి కరువు
రెడీమేడ్ దీపాలతో మట్టి ప్రమిదలకు
తగ్గిన గిరాకీ
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న వృత్తిదారులు


