గంభీరావుపేట/ముస్తాబాద్: ఎల్‌నినో ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. లోటు వర్షపాతంతో వరి, పత్తి పంటల్లో దిగుబడి పడిపోగా.. అడవిలో సహజసిద్ధంగా లభించే సీతాఫలాలకు సైతం కరువు ఏర్పడింది. సీతాఫలాలు మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున రావడం లేదు. వరి పంట కోసిన రైతులు గడ్డిని తమ పశువుల కోసం ఇప్పటి నుంచే నిల్వ చేసుకుంటున్నారు. యాసంగి సీజన్‌లో పంటల సాగుపై సందిగ్ధం నెలకొనడంతో పలువురు పశువుల కాపరుల పశుగ్రాసం కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.
వ్యాపారులకు ఉపాధి కరువు
సీతాఫలాల సీజన్ కోసం ఎదురుచూసే చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. అడవులు, పొలాల గట్ల వద్ద లభించే సీతాఫలాలను సేకరించి మార్కెట్లలో విక్రయిస్తూ జీవనోపాధి పొందే వారికి ఈసారి పండ్ల కొరత సమస్యగా మారింది. గతంలో సీజన్ వచ్చిందంటే మార్కెట్లలో సీతాఫలాలు గుట్టలుగా కనిపించేవి. ప్రస్తుతం బుట్టల్లో పెట్టి విక్రయించేందుకు సరిపడా కాయలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సీజనల్ వ్యాపారుల ఆదాయానికి గండి పడింది.
పశుగ్రాసానికి డిమాండ్
ఎల్‌నినో ఎఫెక్టు మూగజీవాలపై పడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ హెచ్చరికలతో రానున్న ఆరు నెలలపాటు గడ్డికి ఇబ్బందులు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం వరి కోతలు కొనసాగుతుండడంతో పశుగ్రాసాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సాగుతో పాటు, వచ్చే వానాకాలం పంటల వరకు పశువులకు పశుగ్రాసం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గడ్డిని సేకరించే పనిలో రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40లక్షల ఎకరాలలో వరి సాగైంది. దీంతో పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చి పశుగ్రాసం తీసుకెళ్తున్నారు.
కొయ్యకాళ్లు దహనం చేయకుండా..
వరికోతలు కాగానే రైతులు సాధారణంగా కొయ్యకాళ్లతోపాటు హార్వెస్టర్‌తో పంటను కోయించడం ద్వారా అందులోనే పడిపోయే గడ్డిని దహనం చేస్తారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పుడు గడ్డిని తగలబెట్టవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పశుగ్రాసం దగ్ధం చేయడం ద్వారా నేలకు నష్టం కలగడంతోపాటు పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. గడ్డిని కట్టకట్టే యంత్రానికి ఒక కట్టకు రూ.30, కూలీకి కట్టకు రూ.15, ట్రాన్స్‌పోర్టుకు ట్రాక్టర్‌కు రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. ఒక ట్రాక్టర్‌లో 70 కట్టల పశుగ్రాసం తరలించుకుపోతున్నారు.
గడ్డిని నిల్వ చేసుకోవాలి
పాడి రైతులు గడ్డిని ఇప్పుడే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భవిష్యత్‌లో సంభవించే కరవును ఎదుర్కొనేందుకు, పశువులను రక్షించుకునేందుకు ఇదే మార్గమని స్పష్టం చేస్తున్నారు.
పొలాల వద్ద పశుగ్రాసం కట్టలు
వరిగడ్డి మేస్తున్న ఎడ్లు


