ప్రభుత్వాస్పత్రిలో రోగుల సహనానికి పరీక్ష జిల్లా ఆస్పత్రిలో అడుగుపెట్ట సందులేదు రోగులతో కిటకిటలాడుతున్న జీజీహెచ్ సిరిసిల్ల మెడికల్ కాలేజీలో 50 పడకలు సిద్ధం ప్రభుత్వ అనుమతి రాక నిలిచిన షిఫ్టింగ్ రోజూ అవుట్ పేషెంట్లు వెయ్యి.. ఇన్‌పేషెంట్లు 250
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో రోగుల రద్దీ పెరిగిపోయింది. ఓపీ సేవల కోసం నిత్యం వెయ్యి నుంచి 1400 మంది వరకు వస్తున్నారు. జిల్లాలో 117 ప్రైవేటు ఆస్పత్రులు, 47 రోగ నిర్ధారణ కేంద్రాలు ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో అందే వైద్యంపై నమ్మకంతో వీరంతా వస్తున్నారు. రోగులు, వారితో వచ్చే బంధువులతో ఆస్పత్రిలో కాలుపెట్ట సందులేకుండా మారిపోతుంది. ఓపీ చిట్టీ రాయించుకోవడం నుంచి మందులు పొందే వరకు ఎక్కడికి వెళ్లినా భారీ క్యూలైన్లు కనిపిస్తున్నా యి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే రోగులకు మందులు ఇచ్చే కౌంటర్లు రెండే ఉండడంతో రద్దీ పెరిగిపోతుంది. ఏ డిపార్ట్‌మెంట్‌కు అక్కడే మందులు ఇస్తే రద్దీ ఉండదని రోగులు పేర్కొంటున్నారు.
మెడికల్ కాలేజీలో 50 పడకలు సిద్ధం
పెద్దూరు బైపాస్ రోడ్డులోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఇటీవల మెడికల్ కాలేజీ వద్ద ఉన్న ఆస్పత్రి భవనాన్ని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు ప్రవీణ్‌కుమార్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (సివిల్ సర్జన్) సుమన్‌మోహన్‌రావు, మెడికల్ కాలేజీ వైద్యులు పరిశీలించారు. అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఆస్పత్రిలో 50 పడకలతో భవనం సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు.
క్రిటికల్ కేర్ తరలిస్తే..
‘కిటికల్ కేర్’ యూనిట్‌ను మెడికల్ కాలేజీకి మార్చితే రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యానికి గురైన వారు, వృద్ధులు, పాము, తేలు కాటు, విషం తాగినవారు, ఇతర అత్యవసర సేవలన్నీ మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటాయి. సిరిసిల్ల పట్టణంలోని ఆస్పత్రిలో రోగుల రద్దీ తగ్గనుంది. ఆ దిశగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ చూపితేనే సిరిసిల్ల ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు దరి చేరనున్నాయి.
‘వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారంతా సర్కార్ ఆస్పత్రి వైద్యంపై
నమ్మకంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వస్తున్నారు. డాక్టర్‌ను కలవాలంటే ఓపీ(అవుట్ పేషంట్) చిట్టీ రాయించుకోవాలి. ఇక్కడ నిత్యం సగటున వెయ్యి నుంచి 1400 మంది రోగులు వస్తున్నారు. ఓపీ చిట్టీ కోసమే క్యూలో నిల్చునేందుకు ఓపికలేక
అవస్థలు పడుతున్నారు.’
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
సిరిసిల్ల ఆస్పత్రికి నిత్యం సగటున నిత్యం వెయ్యి ఓపీ, 250 ఐపీ ఉంటుంది. మెడికల్ కాలేజీలోని 50 పడకల ఆస్పత్రి సిద్ధమైంది. కొన్ని వసతులు కల్పించాల్సి ఉంది. వాటిపై నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అన్నీ వసతులు పూర్తయితే క్రిటికల్ కేర్ యూనిట్‌ను మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు


