● సిరిసిల్లలో ఘనంగా నిమజ్జనోత్సవం ● ఆది దేవుడికి అడుగడుగునా నీరాజనం ● కనులపండువగా శోభాయాత్రలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సిరిసిల్లటౌన్: నవరాత్రులపాటు విశేష పూజలందుకున్న ఆదిదేవుడు గణపయ్యకు సిరిసిల్ల ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. శుక్రవారం ఉదయం నుంచే వినాయక విగ్రహాల నిమజ్జన మొదలైంది. అధికారులు మానేరువాగులో రెండు కొలనులు ఏర్పాటు చేయగా వర్షాలు కురవడంతో నదిలో నీటి ప్రవాహం మొదలైంది. పట్టణంలోని అన్ని వాడల్లో కలిపి సుమారు 800లకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారు. డీజే సౌండ్, జనరేటర్ సాయంతో విద్యుత్ దీపాలంకరణలతో వినాయకుల ఊరేగింపు కనులపండువగా సాగింది. పట్టణంలోని నలుమూలల నుంచి వచ్చిన వినాయకులను గాంధీచౌక్ మీదుగా మానేరువాగుకు తరలించారు. రూ.15లక్షలతో మున్సిపల్ ఆధ్వర్యంలో మానేరువాగు తీరంలో ఏర్పాటు చేశారు. మూడు భారీ జనరేటర్లు, ఏడు క్రేన్లు, 36 మంది గజ ఈతగాళ్లు, 70 మంది శానిటేషన్ కార్మికులు, సిబ్బందిని వినియోగించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది 300 మంది బందోబస్తులో పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుగోపాల్, డీఈ అంజయ్య, ఏడీఏ శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో డి.శ్రీధర్‌బాబు, డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్‌రావు, టౌన్ సీఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా పర్యవేక్షించారు.


