2 కి.మీ పైపులైన్ పనులు పూర్తి చేయాలి
ప్రజాప్రతినిధులు, రైతుల డిమాండ్
వీర్నపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద చేపట్టిన రాయిని చెరువు పైప్‌లైన్ పనులు పూర్తి చేసి చెరువును గోదావరి జలాలతో నింపాలని మండలం మద్దిమల్ల గ్రామ సర్పంచ్, రైతులు డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలోని రాయినిచెరువు వద్ద ఆదివారం వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మద్దిమల్ల సర్పంచ్ ప్యాట్ల రవి, మద్దిమల్లతండా సర్పంచ్ కొడావత్ శిరీష, బంజార సర్పంచ్ బట్టు కృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అల్మాస్‌పూర్ నుంచి రాయినిచెరువు వరకు పైప్‌లైన్ పనులు చేసినట్లు తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో అనుమతులు లేవనే సాకుతో పనులు నిలిచిపోయాయన్నారు. మూడేళ్లుగా పనులు ఆగిపోవడంతో చెరువులోకి చుక్క నీరు రాక వేసవిలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయినిచెరువు నిండితే మద్దిమల్ల, రంగంపేట, కంచర్ల, అల్మాస్‌పూర్, వీర్నపల్లి, అడవిపదిరతోపాటు కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 2,435 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచులు సామల్ల దేవరాజు, గుగులోత్ రమేశ్, చాంద్ పాషా, గుగులోత్ సురేష్, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్, గుగులోత్ రవిలాల్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గోర్ సేన మీడియా, వివిధ గ్రామాల రైతులు గడ్డం దేవయ్య, ప్యాట్ల మల్లయ్య పాల్గొన్నారు.


