అడవికి ఆపద | - | Sakshi
Sakshi News home page

అడవికి ఆపద

Mar 16 2026 7:41 AM | Updated on Mar 16 2026 7:41 AM

● ఈసారి ఫైర్‌లైన్లు లేనట్టే ● నిధులు కేటాయించని ప్రభుత్వం ● చేతులెత్తేసిన అధికారులు ● ఇక అడవులకు గడ్డుకాలమే ● 27వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆకురాలే కాలంలో అడవులకు ముప్పు పొంచి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే పచ్చని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఫైర్‌లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కూలీలతో ఫారెస్ట్‌ అధికారులు ఆ పని చేయించేవారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఫైర్‌లైన్ల పనులు మొదలుకాలేవు. ఇప్పటికే జిల్లాలోని అటవీలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పనులు ముందుకుసాగలేవు.

27 హెక్టార్లలో అడవి విస్తీర్ణం

జిల్లాలోని 27వేల హెక్టార్‌లలో అడవి విస్తరించి ఉంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికంగా అడవులు ఉన్నాయి. అడవుల్లో వన్యప్రాణులు ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటాయి. ముఖ్యంగా దుప్పులు, చిరుతలు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, మనుబోతులు, ముళ్లపందులతోపాటు నెమళ్లు వంటి అరుదైన జీవజాతులు సంచరిస్తుంటాయి. ఈక్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే రోడ్ల వెంట ప్రయాణించే ఆకతాయిలతోపాటు అడవిలో పశువులు, గొర్రెల కాపరులు బీడీ తాగుతున్న క్రమంలో దాని నుంచి నిప్పురవ్వలు పడి అడవులు కాలిపోతున్న సందర్భాలు అనేకం. ఆకతాయిలైతే ఏకంగా నిప్పు పెడుతుండడంతో అడవి సంపదకు ఆపరా నష్టం కలుగుతోంది. ఈక్రమంలో అడవిలో ఊహించని నష్టం జరగకుండా అధికారులు ముందుగానే ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తే మంటలు అడవి మొత్తానికి విస్తరించకుండా కట్టడి చేసే అవకాశాలున్నాయి.

లక్ష్యం ఇదే..

సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌ల పరిధిలో 12 సెక్షన్లు, 44 బీట్‌లలో కలిపి 27 హెక్టార్‌లలో అటవీ విస్తరించి ఉంది. జిల్లాకు చెందిన అడవులు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌, సిద్ధిపేట జిల్లాలకు చెందిన అడవితో కలిసి ఉంటాయి. ఇవన్నీ ప్రధానంగా ఆకురాల్చే అడవులు కావడంతో వేసవి కాలంలో మంటలు చెలరేగకుండా ఏటా ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఒక మీటర్‌కు రూ.6 ఖర్చు చేస్తూ డబ్బా ఆకారంలో 100 మీటర్ల చొప్పున ఫైర్‌లైన్లు వేస్తారు. ఒక వేళ మంటలు అంటుకున్న అక్కడికే పరిమితమై అడవికి వ్యాపించవు. గ్రామాల్లో హెచ్చరికబోర్డులు అవగాహనతో అడవిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. వనాలు దగ్ధం కాకుండా వేసవిలో బీడీల తయారీకి ఉపయోగించే ఆకు, ఇప్పపూలు సేకరించేందుకు, నేలపై పడిన ఆకులను ఏరివేసేందుకు కూలీలను నియమించి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి తమకు తెలియకుండా పడేసిన బీడీలు, సిగరేట్లు ప్రమాదాలకు కారణం అవుతుండగా దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు అడవిలోని రాళ్లు రాపడి జరుగుతున్న క్రమంలో మంటలు ఎగసిపడే ప్రమాదాలు ఉన్నాయి. దానిని శాటిలైట్‌, గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు వెళ్లేలోపే ఫైర్‌లైన్లు లేకపోవడంతో మంటలు వ్యాప్తి చెందుతున్నాయి.

ఈ చిత్రం ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువుతండా శివారులో అడవికి మంటలు వ్యాపించి విలువైన కలప కాలిపోతోంది. అధికారులు ఫైర్‌లైన్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో ఫైర్‌లైన్లతో రక్షణ ఉండేదని.. ఇప్పుడు ఎండలు ముదిరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అడవుల రక్షణపై అవగాహన సమావేశాలు మాత్రమే పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement