● తెగిన, గండ్లు పడిన కాలువల మరమ్మతుకు నిధులు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నపేట శివారులో గతంలో కురిసిన భారీ వర్షాలకు గండిపడి తెగిన కాలువను, చందుర్తిలో 450 ట్యాంకును, మల్యాల హంపుహౌస్‌ను శనివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ యాసంగి పంటలకు సాగునీరు అందించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సనుగుల ఎర్ర, పటేల్‌చెరువులతోపాటు జోగాపూర్, ఎన్గల్, బండపల్లి చెరువులలో నీరు ఉంటే మండలం సస్యశామలంగా ఉంటుందన్నారు. రామన్నపేట శివారులో గండి పడ్డ 4 డీ కాలువ మరమ్మతుకు రూ.21లక్షలు మంజూరు చేయించి నట్లు తెలిపారు. ఎల్లంపల్లి నీటితో ఆశిరెడ్డిపల్లె కొత్తచెరువును నింపుతామన్నారు. కొత్త చెరువు నిర్మాణానికి రూ.43లక్షలు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్, ఏనుగు లచ్చిరెడ్డి, నాయకులు మల్లారపు రాజయ్య, దొంగరి భూమయ్య, లక్ష్మణ్‌రావు, ఆవారి మనోహర్ పాల్గొన్నారు.
గోదావరి జలాలకు పూజలు
రుద్రంగి(వేములవాడ): రైతులకు యాసంగి సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎండిపోతున్న పంటలకు మూడు రోజులుగా గోదావరి జలాలను విడుదల చేశారు. ఎల్లంపల్లి కాలువల ద్వారా శనివారం రుద్రంగిలోని గండి వేంకటేశ్వర్ల వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. నాగారం చెరువు కాలువలను పరిశీలించారు. సూరమ్మ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తహసీల్దార్ పుష్పలత, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పల్లి గంగాధర్, గంధం మనోజ్, ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు.


