● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలలో గురు వారం నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ఐదు దశల్లో కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 2న మొదటి దశలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తారని, రెండో దశలో ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మూడో దశలో మే 2న నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు, నాలుగో దశలో మే 22న జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, ఐదో దశలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారని వివరించారు. జిల్లాలో 46,492 మందికి రూ.370.75 కోట్ల రుణ మాఫీ, 1.26 లక్షల రైతులకు రైతుభరోసా అందించామని, 22,554 రేషన్‌కార్డులు జారీ చేశామని తెలిపారు. జూన్ 2లోగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాల భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రమాదాల నివారణకు సహకరించాలి
ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. డీఆర్డీవో గీత, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ చైర్మన్లు జిందం కళ, రాజు, కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, డీపీవో షర్ఫొద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వ్యవసాయ కళాశాల డీన్ సునీతాదేవి, వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, సర్పంచ్ దుబ్బాక రజిత పాల్గొన్నారు.
పనికి సర్పంచ్ కావాలి.. నిధులకు వద్దా?
పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల అధికారుల తీరును ఎండగట్టారు. ఉద్యోగస్తులు నాలుగు గంటలు పనిచేసినా, ఎనిమిది గంటలు పనిచేసినా జీతం వస్తుంది. కానీ సర్పంచులు 24 గంటలు గ్రామం కోసం పనిచేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి, పీఎం మోదీ పది పైసలు కూడా పంప డం లేదన్నారు. పందులు చనిపోయినా సర్పంచ్, ఎలుకలు చనిపోయినా సర్పంచ్.. కానీ పనిచేసేందుకు సర్పంచులు వద్దా? గ్రామపంచాయతీలకు నిధులు లేకుండా పనులు ఎలా చేయాలి? అని అధికారులను నిలదీశారు.


