● పెరుగుతున్న ధరలు ● జనం జేబులకు తూట్లు ● తగ్గిన కోడిగుడ్ల రేట్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. పద్నాలుగు రోజులుగా సాగుతున్న అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో మన ప్రాంతంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విదేశాల నుంచి పామాయిల్, చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో మన దేశానికి వచ్చే నౌకలు నిలిచిపోయాయి. అందులో వస్తున్న చమురు, పామాయిల్ తదితర వస్తువులు దేశానికి చేరే పరిస్థితి లేదు. దీంతో వాటికి అనుసంధానమైన వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
కాగుతున్న వంటనూనెలు
వంటనూనెల ధరలు 25 శాతం పెరిగాయి. పద్నాలుగు రోజుల క్రితం సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధర రూ.152 ఉండగా.. ప్రస్తుతం రూ.175కు చేరింది. పది రోజుల వ్యవధిలో రూ.23 పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. డిస్పోజల్ గ్లాసుల ధరలైతే వందశాతం పెరిగాయి. 50 గ్లాసుల ధర పది రోజుల క్రితం రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.40కి విక్రయిస్తున్నారు. గోధుమపిండి, ఖర్జురాతోపాటు ఆయిల్‌తో సంబంధమున్న వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికై తే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. విశ్వ విపణిలో చమురు బ్యారెల్ ధరలు పెరిగినా ఆ ప్రభావం ప్రభుత్వం సామాన్యులపై పడనివ్వడం లేదు.
తగ్గుతున్న కోడిగుడ్ల ధరలు
పశ్చిమాసియాలో యుద్ధంతో కొడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. రోజుకు లక్షలాది గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం కోడిగుడ్డు రిటైల్ ధర రూ.7 ఉండేది. ప్రస్తుతం రూ.4.20 విక్రయిస్తున్నారు. అధిక మొత్తంలో గుడ్లు కొన్న వారికి రూ.4కు కూడా విక్రయిస్తున్నారు. ఇక వంట గ్యాస్ ఇప్పటికై తే కొత్త బుకింగ్‌లను స్వీకరించడం లేదు. హోటళ్లు, గృహాలకు పరిమిత సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు.


