విజయీభవ..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
16 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
హాజరుకానున్న 8,106 మంది
విద్యార్థులు
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి వచ్చే నెల 16 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లోకి నిమిషం ఆలస్యమైన అనుమతించకపోవడం నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉంది. జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,046, సెకండ్ ఇయర్ 4,060 మంది పరీక్షకు హాజరుకానున్నారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్లకు చేరవేశారు. సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ నంబర్ 83339 16289 అందుబాటులో ఉంటుంది. కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే కేంద్రాల సమీపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఐఈవో శరత్‌కుమార్ తెలిపారు.


