బీఆర్‌ఎస్ రెండో జాబితా
● పొద్దంతా సమీక్షించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటీ చేసే పది మందితో రెండో జాబితాను బీఆర్‌ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. తొలి విడతలో బుధవారం 18 మంది పేర్లు ప్రకటించగా.. రెండో విడతగా మరో 10 మంది పేర్లను ప్రకటించారు. 1వ వార్డులో బూర బాలు, 2లో వేముల రాములు, 4లో అడ్డగట్ల మాధవి బాలకిషన్, 6లో దూడం రజని శ్రీనివాస్, 14లో అడ్డగట్ల మాధవి మురళి, 19లో అన్నారం శ్రీనివాస్, 22లో కత్తెర వరుణ్, 33లో దార్ల అశోక్, 34లో దార్ల సందీప్, 38లో రిక్కుమల్ల రజిత సంపత్‌లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు.
పొద్దంతా కేటీఆర్ సమీక్ష
పట్టణ బీఆర్‌ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొద్దంతా సమీక్షించారు. వార్డుల్లో పోటీ నెలకొనడంతో సయోధ్య కుదిర్చారు. పలువార్డుల నాయకులు పార్టీ టిక్కెట్లు ఆశిస్తూ జనంతో తెలంగాణ భవన్‌కు బలప్రదర్శనకు రావడం విశేషం. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా.. ఇప్పటికే 28 మందిని ప్రకటించారు. ఇంకా 11 వార్డుల జాబితా పెండింగ్‌లో ఉంది.
బీఆర్‌ఎస్‌లో చేరి టిక్కెట్ పొంది
1వ వార్డు రగుడుకు చెందిన బూర బాలు బీఆర్‌ఎస్‌లో చేరి టిక్కెట్ సాధించారు. 6వ వార్డు టిక్కెట్‌ను దూడం రజనీ, శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీ ఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్ ఇన్‌చార్జి తుల ఉమ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, కేడీసీసీబీ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, రామ్మోహన్, వేణు పాల్గొన్నారు.


