ఉడ్తి పతంగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మజ్లిస్ –ఎ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) సత్తా చా టేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సత్తా చాటుకున్న ప తంగ్ పార్టీ మరోసారి విజయబావుటా ఎగరేసేందుకు సన్నద్ధమవుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించి కింగ్‌మేకర్ కావాలని ప్రణా ళికలు రచిస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ మిత్రపార్టీ అయిన కాంగ్రెస్‌తో మరోసారి జట్టు కట్టేందుకు లేదా అవగాహనతో ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ కా ర్పొరేషన్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అసెంబ్లీ, బల్దియా ఎన్నికల్లో వీరి పొత్తు అనివార్యం అయ్యేలా చక్రం తిప్పడం ఆ పార్టీకే చెల్లింది.
కరీంనగర్‌లో
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం పార్టీ 2005లో తొమ్మిది కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. 2014లో రెండు కార్పొరేటర్లకు పరిమితమైంది. 2020లో పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 10 సీట్లకు పోటీచేసి ఏడు సీట్లు గెలుచుకుంది. ఒక కో–ఆప్షన్‌ను బీఆర్‌ఎస్‌తో పొత్తులో భాగంగా కైవ సం చేసుకుంది. ఒకప్పటిలా ముస్లిం మైనార్టీలకే పరిమితం కాలేదు. హిందువులు మెజారిటీ ఉన్న చోట్ల వారినే నిలబెట్టి గెలిపించుకునేలా వ్యూహాలు రచించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ ఫార్ములా రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు పరుస్తోంది. కరీంనగర్‌లో 40 డివి జన్లలో కమిటీలు ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఈసారి 20 చోట్ల పోటీ చే స్తోంది. ఇందులో కనీసం 15 స్థానాలు గెలుచుకొని కరీంనగర్ కార్పొరేషన్‌లో కింగ్‌మేకర్ పాత్రను పోషి స్తూ.. మూడు లేదా నాలుగు కోఆప్షన్లును కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. మొన్న బిహార్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం నిన్న మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది కార్పొరేటర్లను గెలుచుకొని సత్తా చాటింది. అదే ఊపుతో తెలంగాణలోని నిజా మాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్‌లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది.
జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో
2020లో జగిత్యాలలో రెండు, కోరుట్లలో రెండు చొ ప్పున కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. మెట్‌పల్లిలో ఒకటి, పెద్దపల్లిలో రెండు కౌన్సిలర్ సీట్లను కైవస చేసుకుంది. రామగుండంలో ఎంఐఎం మద్దతుతో పలువురు విజయం సాధించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకరిద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అవినీతి బంధుప్రీతి పార్టీ నియమావళి ఉల్లంఘన తదితర కారణాలతో టికెట్లు ఖరారు చే యలేదని సమాచారం. ఒకప్పుడు ఎంఐఎం టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రాజకీయ వలసలు, ముస్లిం దళిత సామాజిక వర్గాల్లో వచ్చిన స్పందనతో డిమాండ్ పెరిగిపోయింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసద్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో మూడు రకాల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా 15 స్థానాల్లో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది.


