వస్త్రోత్పత్తి ఖిల్లా
సిరిసిల్ల స్వరూపం
● నాలుగు దశాబ్దాల కిందటే మున్సిపాలిటీగా.. ● 39 వార్డులతో విస్తరించిన సిరిసిల్ల
సిరిసిల్ల: కార్మిక క్షేత్రం.. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. వస్త్రోత్పత్తి ఖిల్లాగా సిరిసిల్ల ఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా అవతరించింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సిరిసిల్ల రాజకీయ ఉద్దండులకు వేదికై ంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు(పవర్‌లూమ్స్) ఉన్న పట్టణంగా భాసిల్లుతోంది. సిరిసిల్ల ‘పుర’ ప్రస్థానంపై కథనం.
టౌన్ మున్సిపాలిటీగా..
1953లో తొలిసారిగా టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పట్లో పట్టణ జనాభా 12 వేలు ఉండేది. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, రెడ్డివాడ, సుభాష్‌నగర్, గాంధీనగర్, అంబేడ్కర్‌నగర్, పాతబస్టాండు ప్రాంతాలతో కలిసి చిన్న పట్టణంగా ఉండేది. కాలక్రమంలో వెంకంపేట, శాంతినగర్, గోపాల్‌నగర్, పద్మనగర్, కొత్తబస్టాండు, రాయినిచెరువు ప్రాంతాలు కలిసిపోవడంతో బీవై నగర్, పీఎస్ నగర్, ఇందిరానగర్, తారకరామానగర్, గణేశ్‌నగర్, వంశీకృష్ణకాలనీ, రాజీవ్‌నగర్, భూపతినగర్‌లతో పట్టణం విస్తరించింది. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాల విలీనంతో లక్షకు పైగా జనాభాతో 39 వార్డులతో పట్టణ రూపురేఖలు విశాలమయ్యాయి. దేశంలోనే తొలి నేతన్న కాంస్య విగ్రహం ఉంది.
తొలి చైర్మన్ మడుపు మల్లారెడ్డి
సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించాక 1953లో తొలి చైర్మన్‌గా మడుపు మల్లారెడ్డి ఎన్నికై .. 1962 వరకు కొనసాగారు. 1962లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుజ్జె రాజయ్య ఎన్నికయ్యారు. 1964లో సిరిసిల్ల మున్సిపాలిటీని ప్రభుత్వం గ్రామపంచాయతీగా మార్చింది. అప్పటికే మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న గుజ్జె రాజయ్య పాలకవర్గాన్ని 1970 వరకు గ్రామపంచాయతీ పాలకవర్గంగానే కొనసాగించింది. 1971లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రుద్ర శంకరయ్య సర్పంచ్‌గా గెలుపొందారు. పదేళ్లపాటు శంకరయ్య సర్పంచుగా కొనసాగారు. 1981లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుండ్లపల్లి భూమయ్య సర్పంచ్‌గా ఎన్నికై .. 1987 వరకు కొనసాగారు.
మళ్లీ ‘పుర’పాలన
గ్రామపంచాయతీగా ఉన్న సిరిసిల్ల పట్టణాన్ని 1987లో ప్రభుత్వం తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 1988లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ రుద్ర శంకరయ్య సతీమణి రుద్ర సత్తమ్మ మున్సిపల్ తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 1995లో జరిగిన ఎన్నికల్లో మాజీ సర్పంచ్ గుండ్లపల్లి భూమయ్య సతీమణి గుండ్లపల్లి సరోజన చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2000లో ఆడెపు రవీందర్‌ను చైర్మన్‌గా నేరుగా పట్టణ ఓటర్లు ఎన్నుకున్నారు.
పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్ ఎన్నికలు
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈమేరకు 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుడ్ల మంజులను చైర్‌పర్సన్‌గా మెజార్టీ కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు. 2010 నుంచి 2014 వరకు ప్రత్యేకాధికారి పాలన సాగింది. 2014లో మరోసారి సిరిసిల్ల చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సామల పావని ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2019 జూలై 2వ తేదీతో ముగిసింది. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా జిందం కళాచక్రపాణి ఎన్నికై.. 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం ప్రత్యేకాధికారుల పాలన సాగింది.
విస్తరించిన పట్టణం
సిరిసిల్ల కాలక్రమంగా విస్తరిస్తోంది. 2005లో 29 వార్డులు ఉండగా.. 2014 నాటికి 33 వార్డులు అయ్యాయి. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు ఏడు గ్రామాల విలీనంతో ప్రథమశ్రేణి మున్సిపాలిటీగా అవతరించింది. జిల్లా కేంద్రంగా భాసిల్లుతోంది.
జనాభా: 1,12,002, ఓటర్లు: 81,959
పురుషులు: 39,942, మహిళలు: 42,011
థర్డ్ జెండర్ : 06, వార్డులు: 39
పోలింగ్ కేంద్రాలు: 117
పట్టణ విస్తీర్ణం : 51.93 చదరపు కిలోమీటర్లు
గృహాలు: 24,721, అక్షరాస్యత శాతం: 73.7
వస్త్రోత్పత్తి ఖిల్లా


