● సిరిసిల్లలో 134.. ● వేములవాడలో 90 దరఖాస్తులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు గురువారం నామినేషన్ల జోరు కొనసాగింది. సిరిసిల్లలో 134 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఆర్‌ఎస్ 40, కాంగ్రెస్ 36, బీజేపీ 31, సీపీఎం 3, జనసేన 3, ఏఐఎఫ్‌బీ 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 18 చొప్పున నామినేషన్లను సమర్పించారు. రెండు రోజుల్లో 154 నామినేషన్లు దాఖలైనట్లు మున్సి పల్ కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. 13 కౌంటర్ల ద్వారా 30 మంది ఆర్‌వో, ఏఆర్‌వోలు నామినేషన్లు స్వీకరించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్ సీఐ కృష్ణ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
వేములవాడలో..
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజ్‌కుమార్ పరిశీలించారు. ఆర్డీవో రాధాభాయ్, నోడల్ అధికారులు గీత, నవీన్‌కుమార్, భారతి, కమిషనర్ సంపత్‌కుమార్, టీపీవో అన్సార్ ఉన్నారు. రెండో రోజు 90 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 28, బీజేపీ 24, బీఆర్‌ఎస్ 21, జనసేన 5, సీపీఐ 2, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 9 మంది నామినేషన్లు వేశారు.
నామినేషన్లకు నేడు చివరి రోజు
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నామినేషన్ దాఖలుకు శుక్రవారం చివరి రోజు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. గతంలో పలువురు ఆలస్యంగా నామినేషన్ కేంద్రానికి చేరుకొని పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సిరిసిల్లలో 39 వార్డులకు 13 నామినేషన్ కేంద్రాలు, వేములవాడలో 28 వార్డులకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోని హెల్ప్‌లైన్‌కు పెద్దగా ఫిర్యాదులు రా వడం లేదు. సిరిసిల్లకు చెందిన వేముల మార్కండేయులు తన ఓటు హక్కు మిస్ అయిందని ఫిర్యాదు చేయగా.. మరో వార్డులో ఉన్నట్లు ఆధార్‌కార్డు నంబరుతో గుర్తించారు. నామినేషన్ పత్రాల దాఖలు అంశంపై వంగరి అనిల్ ఫిర్యాదు చేశారు.


