● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషాకు సూచించారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, మెప్మా అధికారి మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేశ్‌కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, మాస్టర్ ట్రైనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘లింగ నిర్ధారణ’ చేస్తే కఠిన చర్యలు
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు, కొత్త ప్రైవేట్ దవాఖానాలకు అనుమతులు, నవజాత శిశు మరణాలపై వైద్య, ఆరోగ్య, సంక్షేమ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. భ్రూణ హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ శోభారాణి, ఎన్జీవో ప్రతినిధి భాస్కర్ పాల్గొన్నారు.


