‘చింతలఠాణా’ చిక్కుముడి వీడేదెన్నడో!
ఇది చింతలఠాణా స్వరూపం
● ‘చితి’కిపోయిన వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నిక ● ఉపసర్పంచ్‌కు రాని చెక్‌పవర్ ● గ్రామంలో పేరుకుపోతున్న సమస్యలు ● కలెక్టర్‌ను ఆశ్రయించిన పాలకవర్గం
సిరిసిల్ల: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా సర్పంచ్‌గా మరణించిన వ్యక్తి గెలుపొందాడు. ఎన్నికల ప్రచార సమయంలో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి డిసెంబర్ 3న గుండెపోటుతో చనిపోయాడు. డిసెంబర్ 11న జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు అతని గుర్తు కత్తెరకే ఓటు వేసి గెలిపించారు. గ్రామంలో ఐదుగురు బరిలో నిలవగా.. కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745, బడుగు శ్రీనివాస్‌కు 40, మంత్రి రాజలింగంకు 160, సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు.
పల్లెల్లో పాలన మొదలై నెలదాటింది
అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గాల పాలన డిసెంబరు 22, 2025న ప్రారంభమైంది. కానీ చింతలఠాణాలో ఉపసర్పంచ్‌గా గొట్ల కుమార్, వార్డు మెంబర్లు మరో తొమ్మిది మంది అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఉపసర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి ఎలాంటి బాధ్యతలను అధికారులు అప్పగించలేదు. దీనిపై జిల్లా అధికార అధికారులు ప్రభుత్వానికి నివేదించి వదిలేశారు. ఫలితంగా స్థానిక పాలన లేక చింతలఠాణాలో ప్రజాసమస్యలకు మోక్షం లభించడం లేదు.
కలెక్టర్‌ను ఆశ్రయించిన పాలకవర్గం
కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను చింతలఠాణా ఉపసర్పంచ్ గొట్ల కుమార్, వార్డు సభ్యులు నాయిని రవి, పొత్తూరి దేవరాజు, మంత్రి రాజేశం గురువారం ఆశ్రయించారు. 37 రోజులుగా స్థానిక పాలన లేక గ్రామపంచాయతీ పనులు కుంటుపడుతున్నాయని, స్థానిక మండల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు ఉపసర్పంచ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి చెక్‌పవర్ ఇవ్వాలని వారు కోరారు. అధికారికంగా స్పష్టత ఇచ్చి చింతలఠాణాలో స్థానిక పాలనకు శ్రీకారం చుట్టాలని కోరారు.
ఓట్లు: 2,319, పోలైన ఓట్లు: 1,719, వార్డులు: 10


