నో డ్యూ.. నో సిస్టం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయం బుధవారం ఆశావహులతో కిటకిటలాడుతోంది. కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నోడ్యూ సర్టిఫికెట్ దాఖలు చేయాల్సి ఉంది. దీనికి ఆస్తిపన్ను, కుళాయి బిల్లులు తదితర బకాయిలు చెల్లించేందుకు ఆశావహులు, అభ్యర్థులు, ప్రతిపాదించేవారు భారీగా బల్దియా కార్యాలయానికి తరలివచ్చారు. జనం ఒక్కసారిగా వెల్లువెత్తడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగంలోకి దిగినా, ఒకదశలో తోపులాట చోటుచేసుకుంది. కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆన్‌లైన్‌లో బకాయిలు..
గతంలోనే కుళాయి బిల్లులు చెల్లించినా.. ఆన్‌లైన్ రికార్డుల్లో బకాయిలు ఉన్నట్లు చూపించడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రషీదులు చూపిస్తున్నా నో డ్యూ ఇవ్వడంలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రం కావడంతో అధికారులు రికార్డులు పరిశీలించి బకాయిలను క్లియర్ చేశారు. అయినా.. అధిక సమయం తీసుకోవడంతో ఆశావహులు గంటల తరబడి నిరీక్షించారు. అయితే, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. మరోవైపు.. ఒక్కో నో డ్యూ సర్టిఫికెట్ కోసం కొందరు అధికారులు రూ.3,000, ప్రతిపాదించే వ్యక్తి నుంచి మరో రూ.3,000 చొప్పున ఫీజు వసూలు చేయడంపై అసహనం వ్యక్తమమైంది. ఈ విషయంపై కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ వివరణ ఇస్తూ.. కౌన్సిల్ ఆమోదంతోనే ఫీజులు వసూలు చేస్తున్నామన్నారు.


