సందడి లేని ‘సంగీత’ నిలయం
వేములవాడరూరల్: వేములవాడ ప్రాంతంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా... ‘సంగీత’ నిలయం సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగైంది. 2004 లో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు తన తండ్రి చెన్నమనేని రాజేశ్వర్‌రావు గెలుపు కోసం పాటుపడ్డారు. అప్పటి నుంచి సంగీత నిలయం వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో నాటి ఎన్న్ఙికళ్ఙ కళ వేములవాడలోని సంగీత నిలయంలో ప్రస్తుతం లేదు. మరోవైపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద మాత్రం రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరగడంతో సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఈ సందడి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రత్యేక కథనం.
వేములవాడ నియోజకవర్గం అంటేనే చెన్నమనేనికి పెట్టింది పేరుగా ఉన్నది. నాడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు తదుపరి ఆయన తనయుడు రమేష్‌బాబు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పాలన సాగించారు. ఏ ఎన్నికలు వచ్చినా వేములవాడ సంగీత నిలయంలో కార్యకర్తలు, అభిమానులతో కళకళలాడేది. అలాంటి ఆ సంగీత నిలయం ప్రస్తుతం జన ఆకర్షణ లేకుండా నెలకొన్నది. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద అభిమానులు, కౌన్సిలర్ టికెట్ ఆశించే అభ్యర్థుల రద్దీ నెలకొంది. గతంలో ఎప్పుడూ రద్దీగా ఉండే సంగీత నిలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. నాడు మాజీ ఎమ్మెల్యే దివంగత రాజేశ్వర్‌రావు ఉన్న సమయంలో ప్రతీ ఎన్నికల సమయంలో ప్రజలు క్యూ కట్టేరోజులు కనబడ్డాయి. కానీ.. మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు టికెట్ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జర్మనీలోనే ఉంటున్నారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు టికెట్ ఇవ్వడంతో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలాగైనా వేములవాడ మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురవేయాలని ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రకటించారు.
అభ్యర్థుల వేటలో పార్టీలు....
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మున్సిపాలిటీ కౌన్సిలర్లు పలువురు పోటీ పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఆశిస్తుండగా బీఆర్‌ఎస్, బీజేపీ తరరపున తమ అభ్యర్థులను గెలిపించేందుకు బలమైన అభ్యర్థుల వేటలో ఆ రెండు పార్టీల నాయకులు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా వేములవాడ మున్సిపాలిటీపై ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగురవేయాలని ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీల ప్రధాన నాయకులు సమావేశాలు నిర్వహించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు కలవు. ఇందులో ప్రధానంగా తమ బలమైన అభ్యర్థులను అధికార పార్టీకి దీటుగా పోటీలో ఉంచి మున్సిపల్‌పై తమ జెండా ఎగరవేయాలని ఆ రెండు పార్టీల అభ్యర్థులు దృష్టిపెట్టారు. ప్రధానంగా అధికార పార్టీ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు తమ బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచి మున్సిపల్ జెండా కై వసం చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఆ ప్రధాన పార్టీల నాయకులు వేములవాడ పట్టణంలో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. బుధవారం ప్రధాన పార్టీల నాయకులు ముఖ్య నాయకులతో తమ కార్యాలయంలోకి కొంత మంది సంఘం పెద్ద మనుషులు, పార్టీ సీనియర్ నాయకులతో పిలిపించుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ వేములవాడలో ప్రధాన రాజన్న ఆలయం ఉండడంతో ఇక్కడ మూడు పార్టీల అభ్యర్థులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు.


