
రోడ్డు విస్తరణకు మోక్షం
వేములవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రూ.6.45 కోట్లతో పనులు
వేములవాడ: వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను రూ.6.45కోట్లతో చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు 80 ఫీట్లతో విస్తరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌తో కలిసి రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోడెను కట్టే ఆనవాయితీ రాజన్న ఆలయంలోనే ఉందని.. గుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే వీటీడిఏ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కివెళ్లిన రూ.20కోట్లు తెప్పించి బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. భూ నిర్వాసితుల కోసం రూ.47కోట్ల పరిహారం చెల్లించామన్నారు. వేములవాడను టెంపుల్‌సిటీగా డెవలప్‌మెంట్ చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.150కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత నవంబర్ 20న సీఎం రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
అధునాతన పద్ధతుల్లో పనులు
ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠాధిపతులు, వేములవాడ పట్టణ ప్రజలు, వాస్తు పండితుల సలహాలు తీసుకున్నామని విప్ శ్రీనివాస్ వివరించారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీతోపాటు అధునాతన లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే రూ.76కోట్లతో రాజన్న ఆలయ మొదటి దశ పనులు ప్రారంభిస్తామని, రూ.35కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ పూర్తయిందని తెలిపారు. ఆలయ ఈవో రాధాభాయి, ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, చెలకల తిరుపతి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ పాల్గొన్నారు.
రేపు ఆలయ అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
రాజన్న ఆలయ అభివృద్ధిపై మంగళవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.
ఆలయంలో పనులు వేగంగా పూర్తి చేయాలి
భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. చైర్మన్ చాంబర్‌లో ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో కల్యాణ మండపం, హోమం, వ్రతమండపం, షెడ్ నిర్మాణం, క్యూలైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులపై సమీక్షించారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.