
అబద్దాలతో పాలన సాగించలేరు
కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే ఊరుకోం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అబద్ధాలతో పాలన సాగించలేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్‌లపై ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గోదావరినీళ్లను రైతులకు అందించారని, నాణ్యమైన ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువుల కొరతేనన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంతోపాటు తులం బంగారం, యువతకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గజభీంకార్ రాజన్న, కుంభాల మల్లారెడ్డి, అందె సుభాష్, ఎండీ సత్తార్, మ్యాన రవి, గాజుల బాలయ్య, గడీల సురేష్, గడ్డం భాస్కర్ పాల్గొన్నారు.