
పొలిటికల్ బ్రాండ్.. మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్‌పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్‌పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్‌పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్‌రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్‌రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్‌లు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్‌పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం.