
సమన్వయంతో పనిచేయాలి
● భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● నర్మాల ఎగువమానేరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
గంభీరావుపేట(సిరిసిల్ల): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టును గురువారం ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, ఇన్‌ఫ్లో గురించి ఇరిగేషన్ అధికారుల నుంచి ఆరా తీశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.3టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పది రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు. డ్యాం పూర్తిస్థాయిలో నిండితే ఎక్కువైతే నీటిని సాగునీటి కాలువల ద్వారా విడుదల చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వీరి వెంట ఇరిగేషన్ జిల్లా అధికారి కిశోర్ కుమార్, ఈఈ ప్రశాంత్‌కుమార్, డీఈ నర్సింగ్, పోలీస్ అధికారులు ఉన్నారు.
ఆక్రమించిన భూములు స్వచ్ఛందంగా
అప్పగించాలి
సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రభుత్వ భూమిని ఆక్రమించిన బీఆర్‌ఎస్ నాయకులు ఒజ్జెల అగ్గి రాములు 4.02 ఎకరాల భూమిని కలెక్టర్, ఎస్పీ మహేశ్ బి గితే సమక్షంలో ప్రభుత్వానికి సరేండర్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దాపూర్‌కి చెందిన అగ్గి రాములు సర్వే నం.61/47లోని ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేస్తున్న 4 ఎకరాల 2 గుంటలను తిరిగి అప్పగించాడని తెలిపారు. ఇంకా ఎవరైన ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేవిదంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్‌లో బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఉపకార వేతనాలపై అధికారులతో సమీక్షించారు. కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఆరు నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసి వార్షిక ఆదాయం రూ.1.20లక్షల లోపు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులని అన్నారు. ఆగస్ట్ 31లోగా పదో తరగతి లోపు చదివే పిల్లలు, అక్టోబరు 31వ తేదీలోగా ఇంటర్‌కు పైగా చదివే వారు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు మహేందేర్, మధూకర్, వెంకటేశ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్, వివిధ మండలాల ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు
కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్‌కు వివరించారు.