
ముగింపా.. పొడిగింపా..?
● నేటితో ముగియనున్న సహకార సంఘాల పదవీకాలం
సిరిసిల్లఅర్బన్/ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 14తో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. వీరిని కొనసాగించుడా లేదా ఎన్నికల్లోకి వెళ్లుడా.. అనే విషయమై ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జిల్లాలోని 24 సంఘాల పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 2019లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఆరునెలల పాటు పదవీకాలం పొడిగించారు. అదికూడా గురువారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 15న సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ఎదుట జాతీయజెండాను ఎగురవేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం తమకు దక్కుతుందా లేదా అనే దానిపై అధ్యక్షుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయమై డీసీవో రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఏమైనా నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామన్నారు.
నామినేటెడ్ విధానంలో..?
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రస్తుతం నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేస్తున్నారు. అయితే సహకార సంస్థల్లో కూడా ఇదే పద్ధతిని ప్రభుత్వం అనుసరించే యోచనలో ఉన్నట్లు జిల్లాలో కొంత ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రభుత్వ అనుకూల వర్గాలకు చెందినవారికి పదవులు కట్టబెట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమన్నదానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా పరిధిలోని సహకార సంఘాలు
జిల్లా పరిధిలో మొత్తం 24 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో సిరిసిల్ల, పెద్దూరు, నేరెల్ల, కోనరావుపేట, కొలనూర్, వేములవాడ, నాంపల్లి, రుద్రవరం, చందుర్తి, సనుగుల, మానాల, బోయినపల్లి, కోరెం, మాన్‌వాడ, నర్సింగపూర్, ఇల్లంతకుంట, గాలిపల్లి, ముస్తాబాద్, పోత్గల్, గంభీరావుపేట, కొత్తపల్లి, ఎల్లారెడ్డిపేట, అల్మాస్‌పూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి.