
ప్రభుత్వ సాయంతో ఇళ్లు పూర్తి చేసుకోవాలి
● విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): పేద ప్రజల కలల సౌధమైన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ సాయంతో పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూరు పరిధి గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణ్‌రావు, రమణ దంపతులు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై రమణకు చీర సారే అందించారు. మండలంలోని గొల్లపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ నిర్మాణాలు పూర్తి చేసుకొని రానున్న దసరా పండుగకు గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీడీవో శంకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మరో 7 మీ సేవ కేంద్రాలు
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: ప్రజా ప్రయోజనార్థం జిల్లాకు మరో 7 మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట మండల కేంద్రం, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట (అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడు, రుద్రంగి మండలం మానాల, జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19లోపు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అర్హతలు, ఇతర నిబంధనల కోసం https://rajannasiricilla. telangana.gov.in వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.