
అది చిరుత కాదు.. హైనా
ధర్మపురి: ధర్మపురిలో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది చిరుత కాదని, హైనా అని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ తెలిపారు. పట్టణంలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి పరిసర ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని కొందరు జిల్లా అధికారులకు సమాచారం అందించారని, దీంతో ఫారెస్టు సిబ్బందితో సమీప పొలాలు, చెట్లపొదల మాటున గాలింపు చేపట్టామని, ఓ జంతువు పాదముద్ర లభించగా.. అది చిరుత పాదముద్రలని భావించి హైదరాబాద్ ఫోరెన్సికు పంపించామని తెలిపారు. అక్కడ చిరుత పా దముద్రలు కావని, హైనా అడుగులుగా గర్తించారని తెలిపారు. హైనాతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగదని, మేకలు, గొర్రెల కోసం వస్తుంటుందని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సదాశివుడు, సిబ్బంది తదితరులున్నారు.
కాపర్‌వైర్ దొంగల అరెస్టు
ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీశ్ కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్‌ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారి వద్ద కాపర్‌వైరు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్‌ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్‌ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012 నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.