
ఆ తండ్రికదే చివరి వేడుక
కరీంనగర్‌రూరల్: ఆ తండ్రికదే చివరి వేడుక అయింది.. కొడుకు పుట్టినరోజునే గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీపండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహం కోసం సింగాపూర్ నుంచి మూడు రోజులక్రితమే వచ్చి అనూహ్యరీతిలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన దావు మధుకర్‌రెడ్డి(46) ఉపాధి నిమిత్తం సింగాపూర్ వెళ్లాడు. మూడురోజులక్రితం గ్రామానికి వచ్చిన ఆయన శనివారం కుటుంబసభ్యులతో కలిసి రాఖీపండుగ జరుపుకున్నాడు. ఆదివారం కొడుకు సాత్విక్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల అనంతరం రాత్రి విందులో పాల్గొన్న మధుకర్‌రెడ్డికి ఆకస్మికంగా గుండెపోటురావడంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాఖీ పండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సింగాపూర్ నుంచి వచ్చిన మధుకర్‌రెడ్డి మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సింగాపూర్ నుంచి రాకపోయినా బతికేవాడంటూ విలపించారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కొడుకు పుట్టినరోజున గుండెపోటుతో మృతి
మూడురోజుల క్రితం సింగాపూర్ నుంచి రాక