
రెండు ఆటోలు ఢీకొని విద్యార్థులకు గాయాలు
జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి శివారుల్లో ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నిత్యం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆటోలో వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తుండగా గుల్లపేట, అర్పపల్లి శివారులో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో గుల్లపేటకు చెందిన గంగాధర సిద్దార్థ, పాలెపు శివానీ చేతులు విరిగాయి. వీరితోపాటు గాయపడిన విద్యార్థులను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆటో డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీత చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు.

రెండు ఆటోలు ఢీకొని విద్యార్థులకు గాయాలు