
రైతుల అవసరాలకే గోదాం
● జిల్లాలో అందుబాటులో సరిపడా ఎరువులు ● ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు ● సలహాలు, సూచనలకు టోల్ ఫ్రీ 93986 84240 ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: జిల్లాలో అత్యవసర సమయంలో రైతులు వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. పెద్దూరు గ్రామ శివారులోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పడైనా ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా గోదాంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎంఏవో, ఏఈవోలు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతుకు మేలు
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు, దేశానికి మేలు జరుగుతుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగుపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరిగితే రైతులకు లాభం జరగడంతోపాటు దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు సైతం ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2వేల ఎకరాలలో సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా 1,135 ఎకరాల్లో 322 రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇప్పటికే 99 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తయిందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో సలహాలు, సూచనల కోసం టోల్‌ఫ్రీ 93986 84240 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.