
డెంగీకి సర్కార్ వైద్యమే బెస్ట్
సిరిసిల్లటౌన్: డెంగీ జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని.. సర్కార్ వైద్యంతోనే నయం చేయవచ్చని జిల్లా వైద్యాధికా రిణి రజిత పేర్కొన్నారు. డెంగీ కేసులు నమోదైన గ్రామాల్లో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డెంగీ, వైరల్ ఫీవర్స్‌పై భయాందోళన చెందవద్దని సూచించారు. జిల్లాలో డెంగీ, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ గురువారం నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తం ● యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు
● అకారణంగా ప్లేట్‌లెట్స్ ఎక్కించుకోవద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారిణి రజిత
ప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: జిల్లాలో డెంగీ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయంలో కలెక్టర్ కూడా గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఫాగింగ్ చేయడం, నీటి నిలువ గుంతలలో రసాయనాలు చల్లిస్తున్నాం. సాయంత్రం 5 నుంచి 7 గంటల ప్రాంతంలో మెష్‌లు ఉన్నవాళ్లు వాడాలి. లేని వారు తలుపులు, కిటికీలు మూసి దోమలు ఇంట్లోకి రాకండా జాగ్రత్తపడాలి.
ప్రశ్న: డెంగీ జ్వరం లక్షణాలు, నిర్ధారణ ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: హఠాత్తుగా తలనొప్పి, తీవ్ర జ్వరం, కళ్ల నొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరపీడితులు సర్కారు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటే ఏ జ్వరం అనేది తెలుస్తుంది. జ్వరం తగ్గినా పక్షం రోజుల వరకు అలసటగా ఉంటుంది. పండ్లు, రసాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. నిలువ ఉన్న నీటి గుంతల్లో దోమల మందు స్ప్రే చేయిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ చేయొద్దు. వారు కూడా లక్షణాలున్న రోగి రక్తనమూనాలు ప్రభుత్వ ఆస్పత్రి, టీ–హబ్‌లోనే పరీక్షలు చేయించాలి.
ప్రశ్న: ప్లేట్‌లెట్స్ ఎక్కించడం ఎప్పుడు అవసరం?
డీఎంహెచ్‌వో: రోగులకు రక్తస్రావం జరగకుండా ప్లేట్‌లెట్స్ 10వేల వరకు పడిపోయినా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి జిల్లాలో 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరం ఐదు రోజుల వరకు ఉంటుంది. వారం తర్వాత రోగికి రక్తస్రావమైతే పరిస్థితి సీరియస్‌గా ఉందని భావించొచ్చు. వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలి. రోగికి ఫ్లూయిడ్స్ మాత్రమే ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు హైరిస్క్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఎన్‌ఎస్–1 టెస్టులు 1,758, ర్యాపిడ్ టెస్టులు 1,686, మలేరియా 1,880 టెస్టులు నిర్వహించాం. చికున్‌గున్యా కేసులు నమోదుకాలేవు.
ప్రశ్న: జిల్లాలో జ్వరాల పరిస్థితి, నివారణ చర్యలు వివరించండి?
డీఎంహెచ్‌వో: అన్ని మండలాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. డెంగీతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని కాలేదు. అత్యవసర చికిత్సను జిల్లా ఆస్పత్రిలో పలువురికి చేయించగా వారు కోలుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల కన్నా ప్రభుత్వాస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ ప్రకారం జరుగుతుంది. ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి కుండీలు, టైర్లు, కూలర్లు తదితరాల్లో దోమలు ఆవాసం లేకుండా చూడాలి. ఇందుకు వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలి. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్‌కు చికిత్స వివరాలు?
డీఎంహెచ్‌వో: డెంగీ, వైరల్ ఫీవర్స్ నిర్మూలనకు జిల్లా వైద్యశాఖ సన్నద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 53 వైద్యశిబిరాలు నిర్వహించాం. జ్వర పీడితులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలి. జిల్లాలో మెడికల్ కాలేజీ, జిల్లా జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీ–2, యూహెచ్‌సీ–2, పీహెచ్‌సీ–16, బస్తీ దవాఖానాలు–2 ఉన్నాయి. వీటిల్లో 24 గంటలపాటు నిరంతర వైద్యం అందుతుంది. అత్యవసర పరిస్థితులు ఉంటే ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందిస్తాం. డెంగీ, వైరల్ ఫీవర్స్‌కు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు. ప్రభుత్వ వైద్యుడి సంరక్షణలో చికిత్స పొందడం మంచిది.

డెంగీకి సర్కార్ వైద్యమే బెస్ట్