వేములవాడరూరల్: పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని జిల్లా సెరీకల్చర్ ఆఫీసర్ జగన్‌రావు పేర్కొన్నారు. వేములవాడ మండలం వెంకటాంపల్లిలో మేరా రేషమ్ మేరా అభిమాన్–2025లో భాగంగా బుధవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. మల్బరీ తోట నిర్వహణ, నాణ్యమైన ఆకు ఉత్పత్తికి కత్తిరింపు పద్ధతులు, ఎరువుల మోతాదు, నాణ్యమైన కాయ ఉత్పత్తికి క్రిమిసంహారక విధానం గురించి, మల్బరీ వ్యాధి, తెగులు నిర్వహణపై చర్చించారు. శాస్త్రవేత్త మల్లికార్జున, రాఘవేంద్ర, డీహెచ్‌ఎస్‌వో లత, పంచాయతీ కార్యదర్శులు మనీశ, రాము పాల్గొన్నారు.
తల్లిపాలతో అనేక లాభాలు
వేములవాడ: తల్లిపాలే శ్రేష్టమని ఫాగ్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నాగమల్ల పద్మలత పేర్కొన్నారు. కరీంనగర్ ఆబ్‌సే్ట్రటీక్స్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సులో మాట్లాడారు. తల్లిపాలతో కలిగే లాభాల గురించి వివరించారు. బిడ్డలకు పాలివ్వడం వల్ల ప్రసూతి తర్వాత ఏర్పడే శారీరక మార్పులను క్రమబద్ధీకరిస్తుందన్నారు. వైద్యులు శోభారాణి, లీలావతి, ఉష, ఏఎన్‌ఎంలు ప్రభావతి, సత్యవేద పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై నాటక ప్రదర్శన
వేములవాడరూరల్: ప్రతీ ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే మోసాలకు గురికామని వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ మండలం చెక్కపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం సైబర్ జాగరుక్తా దివస్‌లో భాగంగా నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించా రు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉంటే వారి కుటుంబం మొత్తానికి తెలుస్తుందన్నారు. ఎంఈవో కిషన్, జిల్లా సైబర్ సెల్ కానిస్టేబుల్ శ్రీకాంత్, వేములవాడ రూరల్ సైబర్ వారియర్ రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కోనరావుపేట/వీర్నపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. స్థానిక పీహెచ్‌సీని, వీర్నపల్లి మండలం రాసిగుట్టతండా, భూక్యతండాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను బుధవారం తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలన్నారు. డెంగీ తదితర జ్వరాల నివారణపై దృష్టి సారించాలన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి అనిత, వైద్యులు వేణుమాధవ్, బాలకృష్ణ, సీహెచ్‌వో కృష్ణమూర్తి, హెచ్‌ఈవో లింగం, సూపర్‌వైజర్‌లు రషీద్, ఇందిర, పద్మ తదితరులు పాల్గొన్నారు.
భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు షురూ..
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభించే ముందు భీమన్న ఆలయంలో భక్తులకు స్వామి వారి దర్శనాలు కల్పించేందుకు వీలుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. షెడ్లు వేసేందుకు అడ్డుగా ఉన్న భారీ చెట్లను బుధవారం తొలగించారు.

పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగు