
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. సిరిసిల్ల లోని పార్టీ ఆఫీస్‌లో బుధవారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అయినప్పటికీ 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా బీసీ రిజర్వేషన్లు ముందుకు తెచ్చి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 12 శాతం ఉన్న ముస్లింలకు 10 శాత రిజర్వేషన్ ఎందుకు కల్పించాలో వివరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై ప్రేమే ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి 42 శాతాన్ని బీసీలకే కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేస్తే బీజేపీ ఆమోదిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కరెండ్ల మల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, నంద్యాలపు వెంకటేశ్, రాగుల రాజిరెడ్డి పాల్గొన్నారు.