
నెలలో నలుగురు కార్యదర్శులు
● ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో వింత పరిస్థితి
● అంతుచిక్కని బదిలీల వ్యవహారం
● ఈ సమయంలో వెలుగులోకి ఫేక్ అటెండెన్స్
● స్థానికంగా చర్చనీయంగా ట్రాన్స్‌ఫర్లు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నెల రోజుల్లో నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. విధుల్లో చేరుతున్న వారు పట్టుమని పది రోజులు కూడా ఇక్కడ పనిచేయడం లేదు. మళ్లీ బదిలీపై ఇతర గ్రామానికి వెళ్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
వరుస బదిలీలు..
ఈనెల 2వ తేదీన రహీంఖాన్‌పేట గ్రామపంచాయతీ కార్యదర్శి పులి సంధ్య ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీపై వచ్చారు. విధుల్లో చేరి మూడు రోజులు గడవకముందే మంగళవారం తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు బదిలీ అయ్యారు. గత నెల 28న ఇల్లంతకుంట గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.వరుణ్‌కుమార్ బోయినపల్లి మండలం కొదురుపాకకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నలుగురు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడం, అంతలోనే బదిలీపై వెళ్లడం జరిగిపోతోంది. వరుణ్‌కుమార్ స్థానంలో మండలంలోని వెంకట్రావుపల్లి నుంచి చంద్రశేఖర్‌ను కేటాయించారు. అతను కూడా పదిహేను రోజులు గడువక ముందే జూలై 23న సోమారంపేటకు బదిలీ చేశారు. ఇల్లంతకుంటకు సంధ్యకు పోస్టింగ్ ఇవ్వగా ఆరు రోజులకే మరోచోటుకు స్థాన చలనం చేశారు. సోమారంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఎంపీవో శ్రీనివాస్ తెలిపారు. ఇల్లంతకుంట జీపీ కార్యదర్శి ఎస్.వరుణ్ బదిలీ అయిన సమయంలో ఆయన స్థానంలో వచ్చిన వెంకట్రావుపల్లి కార్యదర్శి చంద్రశేఖర్‌ను తిరిగి రెండోసారి కార్యదర్శిగా నియమించడం గమనార్హం.
స్థానికంగా చర్చ
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నెల రోజుల్లోనే నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ సమయంలోనే రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్‌తో మోసం చేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో స్థానికంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చర్చకు దారితీసింది.