
ఘనత సాధించిన తండ్రీకొడుకులు
పెద్దపల్లిరూరల్: యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎల్బ్రోస్ 5,642 మీ ఎత్తు (18,150 అడుగులు) పర్వతశిఖరాన్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన వివేకానందరెడ్డి, ఆయన తండ్రి మహిపాల్‌రెడ్డి అధిరోహించారు. దీంతో కలెక్టరేట్‌లో మంగళవారం తండ్రీకొడుకులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు.
తండ్రిబాటలో తనయుడు..
మాజీ సైనికోద్యోగి అయిన లెంకల మహిపాల్‌రెడ్డి ఇప్పటికే పలు దేశాల్లోని 12 పర్వతాలను అధిరోహించి ఇంటర్నేషనల్ మౌంటనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. తన బాటలోనే తనయుడు వివేకానందరెడ్డిని కూడా పర్వతారోహకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గతేడాది శిక్షణ ఇచ్చారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పతాల్సు పర్వతాన్ని వివేకానందరెడ్డి అధిరోహించారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే యూరప్‌లో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని ఈనెల 3న అధిరోహించారు.
సే నో టు డ్రగ్స్ బ్యానర్ ఆవిష్కరణ
యూరప్‌లోని పర్వతాన్ని అధిరోహించిన వివేకానందరెడ్డి.. అక్కడ సే నో టు డ్రగ్స్ అనే బ్యానర్ ఆవిష్కరించారు. గతనెల 28న రష్యాకు చేరుకుని అక్కడే ఐదురోజుల పాటు శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ మాస్టర్ వివేకానందరెడ్డి ధైర్యసాహసాలతో పర్వతాన్ని అధిరోహించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రానికి, భారతావనికి కీర్తిప్రతిష్టలు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
యూరప్‌లో ఎత్తయిన శిఖరం అధిరోహణ
అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష