
వామ్మో.. వానరదండు
● వణుకుతున్న సిరిసిల్ల ప్రజలు ● ఇళ్లలోకి చొరబడి.. దాడి చేస్తున్న కోతులు ● భయాందోళనలో జిల్లా ప్రజలు ● అధికారులు పట్టించుకోవాలని విన్నపం
సిరిసిల్లఅర్బన్: కండ్లుమూసి.. తెరిచేలోపే ఇళ్లలోకి ప్రవేశించి.. దొరికిన వస్తువును ఎత్తుకెళ్తున్నాయి. తరుముదామని ప్రయత్నిస్తే తిరిగి దాడి చేస్తున్నాయి. ఇలా కోతుల దాడులో జిల్లాలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. పల్లె..పట్నం తేడా లేకుండా కోతుల భయాందోళన వీడడం లేదు. కోతులను ఊళ్ల నుంచి తరిమికొడుదామని గత ప్రభుత్వం చేపట్టిన మంకీ ఫుడ్ కోర్టులు జిల్లాలో మొక్కలు లేకుండా మారిపోయాయి. దీంతో కోతులు ఊళ్ల నుంచి వెళ్లిపోవడం కాదు కదా.. వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జిల్లాలో కోతుల మంద దాడులపై ప్రత్యేక కథనం.
దాడులు.. గాయాలు
● సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్, గణేశ్‌నగర్, బీవైనగర్, పద్మనగర్ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో పలువురిపై దాడి చేశాయి.
● ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఓ వృద్ధురాలిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. మరో సంఘటనలో కోతులు వెంబడించడంతో ఓ వృద్ధురాలు పరుగెత్తగా ప్రమాదవశాత్తు చేదబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాపాడారు.
● ముస్తాబాద్ మండలంలోనూ కోతుల మంద దాడి చేయడంతో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
వానర విధ్వంసం
గుంపులుగా వస్తున్న కోతులు పెంకుటిండ్లు కనిపిస్తే చాలు పెంకులు తీసి కింద పడేస్తున్నాయి. ఒకప్పుడు ఏళ్లకేళ్లు మన్నిక వచ్చే పెంకుటిండ్లు నేడు రెండు, మూడేళ్లలోనే ఉరుస్తున్నాయి. పెంకులు పగిలిపోతున్నాయి. అంతేకాకుండా ఇండ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. కోతుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు చాలా కుటుంబాలు ప్రధాన ద్వారాలు ఎప్పుడూ మూసివేసి ఉంచుతున్నాయి. మరికొందరేమో జాలీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అదనపు ఖర్చు అయినా కోతుల బెడద నుంచి రక్షణకు తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లిల్లో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్కో కోతికి రూ.500 చొప్పున చెల్లించి పట్టించారు. దీని ద్వారా ఆయా గ్రామాల్లో ఏడాది, రెండేళ్లపాటు కోతుల బెడద లేకుండా పోయింది. ఇలాంటి చర్యలు మిగతా గ్రామాల్లోనూ తీసుకుంటే కోతుల నుంచి కొంత మేరకు రక్షణ కల్పించుకున్న వారవుతారు. కోతుల బెడదపై అటవీశాఖ అధికారికి ఫోన్ చేయగా స్పందించలేదు.
భయపడుతున్నాం
ఆడవుల నుంచి కోతులు పట్టణాలు, పల్లెల్లోకి వస్తున్నాయి. ఇంటి ముందు పండ్ల చెట్లు ఉంటే చాలు గంటల తరబడి వాటిపైనే ఉంటున్నాయి. కోతులతో అందరం భయపడుతున్నాం. ఎండాకాలంలో మాత్రమే వచ్చే కోతులు ఇప్పుడు అన్ని కాలాల్లో కనిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ప్రశాంత్, అభికానగర్, సిరిసిల్ల
ఇంట్లోకి చొరబడుతున్నాయి
మా పద్మనగర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఉదయాన్నే ఇండ్లపైకి చేరుకుంటున్నాయి. డోరు తీసి ఉంటే చాలు ఇంట్లోకి చొరబడి ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకెళ్తున్నాయి. నిత్యావసర సరుకులు దక్కడం లేదు. వాటిని బెదిరిస్తే మీదికొస్తున్నాయి. కోతుల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బంక శంకర్, పద్మనగర్, సిరిసిల్ల

వామ్మో.. వానరదండు

వామ్మో.. వానరదండు

వామ్మో.. వానరదండు

వామ్మో.. వానరదండు